కాళేశ్వరం రిపోర్టు కేబినెట్ ముందుకు రావడం, అందులో ఉన్న అంశాలు లీక్ కావడంతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కీలక నేతలు క్యూ కట్టారు. ప్రధానంగా కేసీఆర్ ను టార్గెట్ చేసినట్లుగా నివేదిక ఉండటం, అందులో హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ పేర్లు కూడా ఉండటంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ బీఆర్ఎస్లో ప్రారంభమయింది. స్మితా సభర్వాల్‌తో పాటు కొంత మంది అధికారుల పేర్లు కూడా తప్పు చేసిన వారి జాబితాలో ఉన్నాయి.
ఈ నివేదికలో సారాంశం బయటకు రావడంతో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు ఫామ్ హౌస్ గేట్లు తెరిచారు. ప్రశాంత్ రెడ్డి రెండు రోజుల నుంచి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. జగదీష్ రెడ్డి, హరీష్ రావు అంతా సోమవారం ఉదయం చేరుకున్నారు. కేటీఆర్ మధ్యాహ్నం వచ్చారు. కేబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారన్నదానిపై తదుపరి కార్యాచరణ ఖరారు చేయాలనుకుంటున్నారు.
కాళేశ్వరం దండగని ప్రచారం చేస్తున్న వారి గురించి ప్రజలకు చెప్పాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. కుట్ర పూరితంగానే రిపోర్టులోని కొన్ని అంశాలను లీక్ చేశారని… కొన్ని అరెస్టులు కూడా ఉండవచ్చని కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. అరెస్టులు జరిగినా ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించినట్లుగా తెలుస్తోంది.