కాళేశ్వరం , బనకచర్ల వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టాలని అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేన్లకు తగ్గట్లుగానే మొత్తం డీటైల్స్ తో కేసీఆర్ కౌంటర్లు ఇస్తారని అంటున్నారు. అయితే ఎప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. రెండు రోజుల్లో ఉండవచ్చని అంటున్నారు.
బహుశా రేవంత్ రెడ్డికి కేటీఆర్ పెట్టిన 72 గంటల ప్రెస్మీట్ టార్గెట్ అయిపోయిన తర్వాత రేవంత్ తమ సవాల్ స్వీకరించలేదు కాబట్టి తామే డీటైల్స్ బయటపెడతామనికేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఓ వైపు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడింది. బీఆర్ఎస్ ముందుకు వస్తే..అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ పదే పదే సవాల్ చేస్తున్నారు. అలాంటి సమయంలో విడిగా ప్రెస్ మీట్ పెడితే ప్రయోజనం ఉంటుందా అన్నది ప్రధానమైన ప్రశ్న.
ప్రజలు ఏకపక్ష ప్రెస్మీట్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. అసెంబ్లీలో పోటాపోటీగా జరిగే సమావేశాలు, చర్చలకు ఆసక్తి చూపిస్తారు. అక్కడ జరిగే చర్చలతో ప్రజలు ఏది నిజమో.. ఏది అబద్దమో ఓ నిర్ణయానికి వస్తారు. ప్రెస్ మీట్ల వల్ల .. ప్రజల అభిప్రాయాల్లో మార్పులు రావు. అయినా బీఆర్ఎస్, కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఎందుకు ప్రెస్మీట్లకు ప్రాధాన్యమిస్తున్నాయన్నది చర్చనీయాంశం అవుతోంది. వారు అసెంబ్లీకి వచ్చి సరిగ్గా సమయం ఇవ్వకపోతే ఆ విషయం కూడా ప్రజలు చూసుకుంటారు.. మరి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు?