కేసీఆర్ అంటే మాటలతోనే మంటలు పుట్టించే నాయకుడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటానికి ఆయన నేరుగా రంగంలోకి దిగి రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేయడం కాదు. కేసీఆర్ ఏనాడూ ఫీల్డులోకి వచ్చి ఉద్యమం చేయలేదు. ఆ ఉద్యమానికి కావాల్సిన చురుకుదనం మాత్రం ఆయన తన మాటలతో ఇచ్చేవారు. అప్పట్లో ఉన్న సెంటిమెంట్, దానికి తగ్గ మాటలతో ఆయన హుషారెత్తించేవారు. చురుకుపుట్టించేవారు. అందర్నీ కదిలించేవారు. ఆయన ప్రసంగాల స్టైల్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. కానీ కాలంతో పాటు ఇప్పుడా మాటల ఆయుధం కూడా పదును కోల్పోయినట్లుగా ఉంది. రెండేళ్ల తర్వాత మచ్ హైప్ ప్రెస్మీట్ పూర్తిగా తేలిపోయింది. పాత కథలతో చప్పగా సాగిపోగా.. టీవీల్లో చూసేవాళ్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం బీఆర్ఎస్ పార్టీకి నిరాశ కలిగించే విషయమే.
కేసీఆర్ చాలా సార్లు చేసిన ప్రసంగమే .. రిపీట్ !
కేసీఆర్ ప్రెస్మీట్లో దాదాపుగా రెండు గంటల సేపు మాట్లాడారు. అంత సేపు మాట్లాడినా ఆయన కొత్తగా మాట్లాడిందేమీ లేదు. కొత్తగా ఏమైనా ఆకట్టుకునేలా చెబుతారా అని జర్నలిస్టులంతా చకోరపక్షుల్లా ఎదురు చూశారు. కానీ భాషలో కూడా కొత్తదనం రాలేదు. ఆయన ప్రెస్మీట్ అంటే.. ఆయన సృష్టించిన బెంచ్ మార్క్ ను మించి ఆశిస్తారు. అదేమీ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిర్మాణాత్మకంగా చేసిన ఆరోపణలు లేవు. పాలమూరు రంగారెడ్డిని నిర్లక్ష్యం చేస్తున్నారని.. అంటున్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత దండిగా నిధులున్న సమయంలో పదేళ్లు సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చి రెండేళ్లే అయింది. కానీ వాళ్లు పది లక్షల కోట్లు అప్పు ఇచ్చిపోయారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తాను పాలమూరు-రంగారెడ్డి అంటే.. ముందుగా తన పదేళ్లలో ఏం జరిగిందన్నదే చూస్తారు జనం. డీపీఆర్ ఆమోదం పొందలేదని.. కేంద్రం తిప్పి పంపిందని కేసీఆర్ చెబుతున్నారు… డీపీఆర్ ఆమోదం లేకుండా 90 శాతం ఎలా పూర్తి చేశారో అనే డౌట్ ప్రజలకు వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతూ.. తన గొప్పలు చెప్పుకుని ఇతరుల్ని తిట్టి కేసీఆర్ కంబ్యాక్ అనిపించుకునే ప్రయత్నం చేశారు తప్ప.. ప్రజల్ని ఆకట్టుకునేలా.. వారిని కదిలించేలా కొత్త పాయింట్లేమీ చెప్పలేకపోయారు.
స్పేస్ లేకపోయినా చంద్రబాబును తెచ్చి ఏం సాధిస్తారు?
కేసీఆర్ తన ప్రెస్మీట్ లాంటి ప్రసంగంలో స్పేస్ లేకపోయినా చాలా చోట్ల చంద్రబాబు ప్రస్తావన తీసుకు వచ్చారు. పాలమూరు ప్రాజెక్టుకు కర్ణాటకకు పరిహారం చంద్రబాబు కట్టారు. కానీ తానే వెంటపడ్డానని క్లెయిమ్ చేసుకున్నారు. ఆయన వెంటపడ్డారో లేదో చంద్రబాబు కట్టింది నిజం. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండి.. పాలమూరును దత్తత తీసుకుని అనేక ప్రాజెక్టులు కట్టాలని ప్లాన్ చేశారు. కానీ ఆయన అధికారంలో కొనసాగలేదు. కొనసాగి ఉంటే అయి ఉండేవేమో?. కేసీఆర్ కూడా పదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. మరి ఆ ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు అన్న డౌట్ ఇతరులకు వస్తుందని ఆయన గుర్తించలేకపోయారు. రేవంత్ పెట్టుకున్న పెట్టుబడుల సదస్సు సక్సెస్ కాలేదని చెప్పడానికి చంద్రబాబు ఏపీలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల సదస్సు గురించి ప్రస్తావించి విమర్శలు చేయడం ఎందుకు?. 2014-19 సమయంలో పెట్టుబడుల పరంగా ఏపీకి డ్రీమ్ రన్ .. అని కియా లాంటి పెట్టుబడులే నిరూపించాయి. ఇప్పుడు చంద్రబాబును విమర్శిస్తే.. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా?
కేసీఆర్ పై ప్రజల ఆసక్తి తగ్గిపోయిందనే సంకేతాలు
కేసీఆర్ గతంలో ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే పెద్ద ఎత్తున స్పందన వచ్చేది. కానీ ఈ సారి ఆయన ప్రెస్ మీట్ లైవ్ స్ట్రీమింగ్ అవుతూంటే ప్రధాన చానళ్లలో పట్టుమని ఒక్కో చానల్ కు వెయ్యి మంది మంది కూడా వ్యూయర్ షిప్ లేదు. టీ న్యూస్ గురించిచెప్పాల్సిన పని లేదు. ఆన్ లైన్ లో ఆ చానల్ ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది. కేసీఆర్ చాలా కాలంగా ఫామ్ హౌస్ కు పరిమితం కావడం వల్ల ప్రజలు కూడా ఆయనపై ఆసక్తి కోల్పోయారు. ఆయన మాటల్లోనూ గతంలోలా చురుకుదనం లేదు. ఎప్పటిలా.. కాంగ్రెస్ , బీజేపీ, చంద్రబాబును తిట్టుకుంటూ.. తెలంగాణకు అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడితే ప్రజలు నమ్మడం కష్టమే. ఎలా చూసినా.. కేసీఆర్ ఇక నేరుగా ప్రజల్లోకి వచ్చినా.. గతంలోలా పట్టించుకునేవారు ఉండకపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి.
