తాతతో కేసీఆర్తో తన కుమారుడికి ఆశీస్సులు ఇప్పించేందుకు కవిత ఫామ్ హౌస్కు వెళ్లారు. కానీ కేసీఆర్తో సమావేశం అయినట్లుగా ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. కవిత ఫామ్ హౌస్ కు అయితే వెళ్లారు కానీ .. తండ్రిని కలవలేకపోయారు. ఆమెతో సమావేశం అయ్యేందుకు, మాట్లాడేందుకు కేసీఆర్ ఆసక్తి చూపించలేదు. కానీ కవిత కుమారుడ్ని మాత్రం పిలిపించుకుని కాసేపు మాట్లాడి పంపించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత తన తల్లితో మాత్రమే మాట్లాడారు.
కవిత కూడా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ చిన్న కుమారుడ్ని కాలేజీలో చేర్పించేందుకు వెళ్తున్నారని చెప్పారు. కానీ గతంలోనే ఆమె కుమారుడ్ని కాలేజీలో చేర్పించారు. సెలవులు అయిపోయి మళ్లీ అమెరికా వెళ్తున్నందున తాతను కలిసేలా కవిత ప్లాన్ చేశారు. తన కుమారుడ్ని కేసీఆర్ వద్దకు పంపగలిగారు కానీ తాను మాత్రం వెళ్లి సమావేశం కాలేకపోయారు. తాత మనవడిని ఒక్కడినే కాసేపు కూర్చోబెట్టుకొని మాట్లాడి పంపించారు.
కవిత జాగృతి పేరుతో సొంత రాజకీయాలు చేస్తూండటం, కేటీఆర్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూండటంతో కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. కవిత రాజకీయ గమనంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. పార్టీకి డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారన్న కారణంగా కవితతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ వెళ్లే ముందు .. కూడా కవిత ఫామ్ హౌస్ కు వచ్చారు కానీ.. అప్పుడు కూడా కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు. మాట్లాడలేదు.
ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే కవితపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే పార్టీ నుంచి ఆమె వెళ్లిపోయే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోరని.. పట్టించుకోకుండా ఉంటారని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.