భారత రాష్ట్ర సమితిలో వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. కేసీఆర్ తన బిడ్డల్లో ఒకరికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే వారిని దూరం చేసుకున్నట్లే అవుతుంది. ఇప్పుడు ఇద్దరికీ సర్ది చెప్పాల్సిన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఒక వేళ కుమార్తె కంటే కుమారుడికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కుమార్తె తన దారి తాను చూసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అలా జరిగితే పార్టీ చీలిపోతుంది. ఇది చాలా క్లిష్టమైన సమస్యే. అందుకే కేసీఆర్ ఈ ఇష్యూపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారన్నది బయటకు రాలేదు.
అయితే కేసీఆర్ ఈ అంశంపై చాలా సీరియస్ గాఉన్నారని..కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని బీఆర్ఎస్ లోని ఓ వర్గం సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే కుమార్తె పట్ల కేసీఆర్ అంత కఠినంగా ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు. షోకాజ్ నోటీసులు జారీ చేయడం.. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వంటివి జరగని విషయాలు అనుకోవచ్చు. కేటీఆర్ పై ఎంత ప్రేమ ఉంటుందో.. కవితపై కూడా కేసీఆర్ కు అంతే అభిమానం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంటి ఆడపిల్ల విషయంలో అసలు కఠినంగా ఉండే అవకాశాలు లేవు. రాజకీయం కోసం ఆయన కుటుంబాన్ని ఇలాంటి పరిస్థితుల్లో చీల్చుకునే అవకాశాలు ఉండవు.
అయితే ఇప్పుడు కుమార్తె, కుమారుడు మధ్య బ్యాలెన్స్ చేయడం అంత తేలిక కాదు. ఇరువురూ సమాన ప్రాధాన్యత కోరుతున్నారు. గతంలో కేటీఆర్ కు రాష్ట్ర బాధ్యతలు.. కవితకు జాతీయస్థాయిలో బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు. కానీ జాతీయ పార్టీ ఫెయిలయింది. మరో రాష్ట్రంలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే కవితకూ రాష్ట్రంలోనే ప్రాధాన్యత కల్పించాల్సి వచ్చింది. లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేసిన తర్వాత బీఆర్ఎస్ లో ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించడానికే ప్రయత్నించారు. అక్కడ్నుంచే అసలు సమస్య ప్రారంభమయింది.
కవిత విషయంలో ఎలాంటి అడుగులు వేసిన అది రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ తన స్టైల్లో వీలైనంత వరకూ మౌనం పాటించి.. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.