చస్తున్నా కూడా ఆంధ్రాపైన ఏడుపేల కెసీఆరూ?

రాష్ట్ర విభజన ముందు వరకూ కూడా సీమాంధ్రులను దోపిడీదారులుగా, తెలంగాణాను దోచుకున్నవారిగా చిత్రీకరించిన నాయకులు ఎందరో? ఆంధ్ర మీడియా అని కెసీఆర్ ఎప్పుడూ విమర్శిస్తూ ఉండే తెలుగు మీడియా ధోరణి కూడా అలాగే ఉండేది. సానుభూతి మొత్తం తెలంగాణాకు, శాపనార్థాలన్నీ సీమాంధ్రకు అన్నట్టుగా ఉండేది వ్యవహారం. వీర సమైక్యవాదినని చెప్పుకున్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి కూడా ఎప్పుడూ తెలంగాణా గురించిన ఆలోచనే. విభజన జరిగితే తెలంగాణా ఎంతలా నష్టపోతుంది? ఎన్ని కష్టాలు పడతారు? అని చెప్పడానికే ఆయన టైం అంతా సరిపోయింది.

రాష్ట్రం విడిపోయింది. తెలంగాణాకు నిధులు, వనరులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు సీమాంధ్రలో భాగమైన వాటిని కూడా తెలంగాణాకు ఇచ్చేశారు. కెసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు ఏ తెలంగాణా ఉన్నదో అదే తెలంగాణా కావాలి అని స్పష్టంగా చెప్పాడు కానీ తెలంగాణా ఓట్లపైన అపార ప్రేమ చూపించిన కాంగ్రెస్, బిజెపిలు మాత్రం కెసీఆర్ అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చేశాయి. విభజన సూత్రధారిగా కెసీఆర్ ఉండి ఉన్నా భద్రాచలంలాంటివి సీమాంధ్రకు వచ్చి ఉండేవేమో అని అనుకోవాల్సిన పరిస్థితి. విభజన కోరుకున్న తెలంగాణాపైన కెసీఆర్ కంటే ఎక్కువ ప్రేమను చూపించాయి కాంగ్రెస్, బిజెపిలు. నిధులు, వనరులు అన్నీ తెలంగాణాకు ఇచ్చి సీమాంధ్రకు మాత్రం మాటల హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా చట్టంలో పొందుపర్చకుండా జాగ్రత్తపడ్డారు. మాటల, మాయల మరాఠీ వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, చంద్రబాబు భజన మీడియా పుణ్యమా అని ఎపి ఓటర్లు బిజెపి ద్రోహాన్ని మర్చిపోయి మోడీని గెలిపించారు. ఆ తర్వాత చెంబుడు నీళ్ళు, దోసిలి మట్టి ఇచ్చాడు మోడీ. అంతటితో సరి.

కులాన్ని మూర్ఖంగా అభిమానించే జనాలు, పార్టీలను నమ్ముకుని ఉండే జనాలను పక్కనపెడితే మిగిలిన సీమాంధ్ర జనాలందరూ కూడా హతాశులయిన పరిస్థితి. ఒకసారి ఓటేశాక మళ్ళీ ఐదేళ్ళవరకూ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రస్తుతంలో నరకం కనిపిస్తున్నా…భవిష్యత్తు బాగుంటుంది అన్న నమ్మకంతో బ్రతుకుతున్నవాళ్ళే ఎక్కువే. అలాంటి సీమాంధ్రులపైన విభజనతో అన్నీ పొందిన తెలంగాణా, ముఖ్యమంత్రి కుర్చీ దక్కించుకున్న కెసీఆర్‌లు సానుభూతి చూపించాలి కానీ ఇంకా ఇంకా రాళ్ళేస్తూ ఉంటాము అంటే ఎలా? దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు దీనంగా చూడాల్సిన పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ఉందన్న విషయం మర్చిపోతే ఎలా? టీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలు చేసుకునే ప్రతి సందర్భంలోనూ సీమాంధ్రులపైన రాళ్ళేస్తూ ఉండడం భావ్యమా కెసీఆర్ సారూ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com