‘తెలంగాణ జాతి పిత కెసీఆర్’ అని తెలంగాణా సమాజాన్ని ఒప్పించాలని కెసీఆర్ భజన బృందం బ్యాచ్ అందరూ చాలా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి కెసీఆర్‌కి నిజంగానే ఆ అర్హత ఉందా? తెలంగాణ రాకముందు వరకూ కూడా తన మాటలు, చేతలతో ఎంత అథమస్థాయికి దిగజారాలో అంతా జారాడు కెసీఆర్. ‘ముఖ్యమంత్రి కుర్చీ కోసమే తెలంగాణా ఉద్యమాన్ని చేపట్టాడు కెసీఆర్’ అని ఉద్యమ సమయంలో తెలంగాణా వాదులే ఘాటుగా విమర్శలు చేశారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్న కెసీఆర్…గెలిచిన వెంటనే మాట మార్చేసి… అందరూ ఊహించినట్టుగానే తానే కుర్చీ ఎక్కేశాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచీ మనుషుల్ని మాయ చేయగలిగే తన మాటలతోనూ, కొన్ని చేతలతోనూ మంచి పేరే తెచ్చుకున్నాడు. కానీ కెసీఆర్ మూఢ నమ్మకాలు మాత్రం భరించలేని స్థాయికి వెళ్ళిపోతున్నాయి. తెలంగాణా సమాజంలో చైతన్యవంతులు చాలా ఎక్కువ. అందుకే ఇది ఉద్యమాల పురిటి గడ్డ అయింది. స్వయం కృషిని నమ్ముకోవడం, పోరాటతత్వం…లాంటి లక్షణాలను తెలంగాణా సమాజానికి నేర్పించాలని ఎంతో మంది మేధావులు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ మేధావుల పేర్లు, వాళ్ళ మాటలు చెప్పుకునే పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు కెసీఆర్. కానీ ఆ మాటలకు, కెసీఆర్ చేతలకు అస్సలు పొంతనే ఉండదు. మూఢ భక్తికి బ్రాండ్ అంబాసిడర్ కెసీఆర్ అనేలా ఉంటుంది ఆయన వ్యవహారం.
‘ప్రగతి భవన్’(?) అని పేరు పెట్టి కట్టించిన కొత్త ఇంటిలోకి ప్రవేశించిన కెసీఆర్ తన చర్యలతో అందరూ ఆశ్ఛర్యపోయేలా చేశాడు. చిన్న జీయర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆ కుర్చీకి ప్రత్యేకత ఏం ఉంటుంది? అని కొంతమంది ప్రశ్నించొచ్చు. కానీ అలా అనుకుంటే రాష్ట్రపతి భవన్, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసాలకు ప్రత్యేకత అంటూ ఏమీ లేకుండా పోతుంది. కెసీఆర్ ఇంట్లో ఛెయిర్ అయితే ఎవ్వరు కూర్చున్నా ఎవ్వరూ ఏమీ అడగడానికి లేదు. అలాగే తన ఇంటి వ్యవహారాలలో ఒక చినజీయర్ అనే కాదు…ఇంకా వేరే ఏ స్వాములకు…ఈవెన్ దొంగస్వాములకు ప్రాధాన్యం ఇచ్చినా కూడా ఎవ్వరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కుర్చీలో చినజీయర్‌ని కూర్చోపెట్టడం మాత్రం కెసీఆర్ బానిస మనస్తత్వాన్ని, మూఢనమ్మకాలను తెలంగాణా సమాజానికి ఆపాదించడమే.
Chinna Jiyyar in CM official chair. Isn't this taking too far?
Imposing personal beliefs in a democracy.
Courtesy : ETV2 pic.twitter.com/ZUpl6zhV75
— Telugu360 (@Telugu360) November 24, 2016
ఫోటో కర్టసీ : ఈటీవీ తెలంగాణ
ఇక ఈ సందర్భంలోనే చినజీయర్ గురించి కూడా చెప్పుకోవాలి. మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈయన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఆ మాటల్లోనే నేను చాలా గొప్పవాడ్ని, దేవుని యొక్క ప్రత్యేక బిడ్డను, మా తాత ముత్తాతల నుంచి మాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అన్న అర్థాలు ధ్వనిస్తూ ఉంటాయి. సమాజానికి సూక్తి ముక్తావళి బోధించడానికే మేం పుట్టాం అని మూఢ భక్తులను నమ్మించే ఇలాంటి ప్రయత్నాలను అన్ని మతాల్లోనూ ఉన్న ఇలాంటి వారందరూ చేస్తూ ఉంటారు. ఆశలు ఎక్కువగా, ఆలోచనలు తక్కువగా ఉండే ప్రజలను నమ్మించడానికి వాళ్ళకు తెలిసిన మార్గం అదొక్కటే. కానీ అలాంటి వాళ్ళను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం అంటే ప్రజలకు ఏం మెస్సేజ్ ఇస్తున్నట్టు? ఫలానా మంత్రి నాకు తెలుసు, పవర్లో ఉన్న ఫలానా వాడు నాకు తెలుసు అని చెప్పుకుని బోలెడన్ని లాభాలు చేసుకునేవాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచీ కూడా చినజీయర్కి కెసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యం ఏ స్థాయిలో ఉంటూ ఉందో అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సాన్నిహిత్యాన్ని తన స్వార్థం కోసం చినజీయర్ ఉపయోగించుకోడని కెసీఆర్ చెప్పగలరా? ఆయన యోగి, సన్యాసి లాంటి మాటలు చెప్పొద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ తిరగరు.
ఒక్క కెసీఆర్ అనే కాదు, మన నాయకులందరూ కూడా… ప్రజల ఆశలను, భయాలను క్యాష్ చేసుకుంటూ, వాళ్ళ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ ఉండే వారిని అధికార నివాసాలకు, అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంచితే మంచిది. కనీసం భావితరాల వారైనా బానిస మనస్తత్వాన్ని వదిలేసి సొంత ఆలోచనలను, కష్టాన్ని నమ్ముకునే పరిస్థితులు వస్తాయి.