బీఆర్ఎస్ సీనియర్ నేతలు ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన సీనియర్ నేతలను కేసీఆర్ దూరంగా ఉంచుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోచారం వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఎర్రబెల్లి అసలు హైదరాబాద్ కూడా రావడం లేదు. పాలకుర్తికే పరిమితమవుతున్నారు.
కేసీఆర్ ఇటీవలి కాలంలో చాలా మంది ముఖ్యనేతలతో సమావేశం అవుతున్నారు. ఆ ముఖ్య నేతల్లో తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి కనిపించడం లేదు. తలసాని ఎన్నికల్లో పోటీకి కూడా నిరాకరించారు. ఇప్పుడు గొర్రెల స్కాం బయటకు రావడంతో పూర్తిగా సైలెంటుగా ఉండిపోతున్నారు. కాళేశ్వరం విషయంలో కనీసం ఖండన ప్రకటనలు కూడా చేయడం లేదు. ఇక ఎర్రబెల్లి దూరంగా ఉండి.. కేసీఆర్ ను టచ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని ఇప్పటికే చాలా సార్లు ప్రచారం జరుగింది. కానీ అంత గట్టిగా ఖండించలేకపోతున్నారు.
ఇక మల్లారెడ్డిని కూడా కేసీఆర్ ఇప్పుడు దూరం పెడుతున్నారు. గతంలో ముఖ్యనేతల సమావేశం అంటే.. మల్లారెడ్డి పేరు ముందుగా కనిపించేది. ఇటీవల కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో ఉంటే మల్లారెడ్డి పరామర్శించడానికి వెళ్లారు. కానీ అప్పుడే ముఖ్యనేతలతో కేసీఆర్ ఆస్పత్రిలో సమావేశం అయ్యారు. కానీ ఆ సమావేశానికి ఉండాలని మల్లారెడ్డిని బీఆర్ఎస్ నేతలు కోరలేదు.
ప్రస్తుతం వారు తమ పార్టీలో చేరిన విధానాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు అధికార పార్టీ కూడా అలాగే చేస్తే.. తమ విషయాలన్నీ బయటకు తెలుస్తాయన్న కారణంగానే వారిని దూరం పెడుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.