బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలపై కేసీఆర్ బిందాస్‌గా ఉన్నారు. ఆయన పెద్దగా కంగారు పడటం లేదు. కవిత తిరుగుబాటు చేయడాన్ని ఆయన పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని సంకేతాలు ఇచ్చారు. గురువారం ఆయన ఫామ్ హౌస్ లో పంటల పరిశీలనకు వెళ్లారు. ఉదయం కారులో ఆయన పార్టీ నేతలు లేకుండా .. ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసే వారితో కలిసి వెళ్లి పంటల్ని పరిశీలించారు. ఆ తర్వాత గోశాలకు కూడా వెళ్లారు. అన్ని పంటలు పరిశీలిచి.. వాటి ఎదుగుదలను తెలుసుకుని.. కొన్ని సూచనలు చేసి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి బీఆర్ఎస్ లో పరిణామాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్ సహా పలువురు ముఖ్యనేతలు ఫామ్ హౌస్‌లో ఉండటంతో భవిష్యత్ కార్యాచరణపై అదే పనిగా చర్చిస్తున్నారని చాలా మంది అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. మిగిలిన నేతలు అక్కడే ఉండి ఏం చేస్తున్నారో కానీ కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ పనుల్లో బిజీగా ఉన్నారని..తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలు నిరూపించాయి.
పార్టీ వ్యవహారంలో .. కవిత విషయంలో కేసీఆర్ అంతగా పట్టించుకోకపోవడం బీఆర్ఎస్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఓ వైపు కాళేశ్వరం రిపోర్టు మీద విచారణకు ప్రభుత్వం సీబీఐకి సిఫారసు చేసింది. ఈ అంశంపై ఏం చేయాలా అని పార్టీ నేతలు మేథోమథనం నిర్వహిస్తున్నారు. మరో వైపు ఈ ఎపిసోడ్ లో కవిత ప్రధాన విలన్ గా ప్రోజెక్ట్ చేసిన హరీష్ రావు ప్రస్తుతం యూకేలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజకీయాలు మరింత ఊపందుకోనున్నాయి.