“నా కళ్ల ముందే తెలంగాణ ఇంత గోసపెడుతుందని ఊహించలేదు..ఇక నేను బయల్దేరుతా” అంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభ సాక్షిగా కాంగ్రెస్ పై సమరశంఖం పూరించారు కేసీఆర్. ఆయన ప్రకటనతో గులాబీ క్యాడర్ ఉబ్బితబ్బిపోయింది. ఆలస్యమైనా కేసీఆర్ సరైన టైంలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని తెగ సంబురపడిపోయింది. కట్ చేస్తే క్యాడర్ ఆశలను ఆడియాశలు చేస్తూ కేసీఆర్ అమెరికా బయల్దేరుతున్నారు.
అవును.. కేసీఆర్ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న మనవడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. వీసా కోసం నానక్ రాంగూడలోని అమెరికా కాన్సులేట్ కు కేసీఆర్ వెళ్లినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. అమెరికా వెళ్లనున్న కేసీఆర్ అక్కడ ఎన్ని రోజులు రోజులు ఉంటారనేది స్పష్టత లేదు..కానీ, మనవడితో కొన్ని రోజులు గడుపుతారని అంటున్నారు.
అయితే , కేసీఆర్ అమెరికా పర్యటన బీఆర్ఎస్ వర్గాలను నిరుత్సానికి గురి చేస్తోంది. జనంలోకి వస్తా.. జనం సమస్యలపై పోరాడుతానని చెప్పి సడెన్ గా అమెరికా వెళ్తే ఎలా అంటూ క్యాడర్ అసంతృప్తిగా ఫీల్ అవుతోంది. ఏ కారణంతో కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తున్నా అది అధికార కాంగ్రెస్ పార్టీకి చక్కని అవకాశం అని అభిప్రాయపడుతున్నారు.
జనంలోకి వస్తానని..కేసీఆర్ అమెరికా వెళ్తే కాంగ్రెస్ దీనిని వారికీ అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. ప్రజా పాలనలో కేసీఆర్ ఫైట్ చేసేందుకు ఏ సమస్యలు లేవు కనుకే ప్రజాక్షేత్రంలోకి రాకుండా మనవడి కోసం అమెరికా కేసీఆర్ వెళ్లారని ఎదురుదాడి చేసే అవకాశం ఉంది.