తెలంగాణలో నీటి రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో భారీ వర్షాలు, నిండిన ప్రాజెక్టుల వల్ల నీటి కొరత లేకపోయినప్పటికీ, నీటి కేటాయింపులు . హక్కుల అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చుకుని రాజకీయంగా పుంజుకోవాలని బీఆర్ఎస్ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించి, కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్ని ఈ అంశం ఎంత వరకూ కదిలిస్తుందన్నది సస్పెన్స్ గానే ఉంది.
బీఆార్ఎస్కు ఊపిరి పోసేది నీళ్లేనని కేసీఆర్ భావన
సాధారణంగా నీటి సమస్యలు ఉధృతంగా ఉన్నప్పుడు చేసే పోరాటాలకు ప్రజల నుంచి తక్షణ స్పందన వస్తుంది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళతో ఉన్న తరుణంలో నీటి పోరాటం చేయడం వెనుక బీఆర్ఎస్ దీర్ఘకాలిక వ్యూహం కనిపిస్తోంది. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టుల బదిలీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిధులు, కృష్ణా జలాల్లో వాటా వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తోంది.
వరుస దెబ్బలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు తెలంగాణ నీళ్లు అనేది ఆయుధంగా కనిపిస్తోంది. గతంలో ఉద్యమ సమయంలో నీళ్ల కోసమే పోరాడామన్న విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి లేదా కేంద్రానికి లొంగిపోతోందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో కేడర్‌లో మళ్లీ ఉత్సాహం నింపవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.
గట్టిగానే ఎదురుదాడి చేస్తున్న రేవంత్ రెడ్డి
అయితే తెలంగాణ నీటి అన్యాయం ఏదైనా జరిగింది అంటే.. పూర్తిగా కేసీఆర్ హయాంలోనేనని రేవంత్ రెడ్డి అంటున్నారు. కృష్ణా జలాలు 299 టీఎంసీలు చాలు అని సంతకాలు పెట్టి వచ్చింది కేసీఆరేనని రేవంత్ అంటున్నారు. దమ్ముంటే ప్రతిపక్ష నేత హోదాలో లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై మాట్లాడదామని సవాల్ చేస్తున్నారు. అయితే అసెంబ్లీ గురించి కాకుండా ప్రజల్లోకి మాత్రమే జల వివాదాలను తీసుకెళ్లి..కాక రేపాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ మాటల పవర్ తో రాజకీయం మారే రోజులు పోయాయి !
గతంలో కేసీఆర్ మాటలే తూటాలు. ఆయన మాట్లాడితే రాజకీయం మారిపోయేిద. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడితే అంతా అతిశయోక్తిలా కనిపిస్తోంది. పార్టీ సిల్వర్ జూబ్లి ప్రచార సభలో ఆయన మాట్లాడిన విషయాలను ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఆ సభ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయారు. అయినా పార్టీని గాడిలో పెట్టడానికి కేసీఆర్ కృషి చేయాల్సిందే కాబట్టే సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ నిర్వహించే ఈ సమావేశం పార్టీకి ఒక దిశానిర్దేశం చేస్తుంది కానీ, అది ఓట్ల రూపంలో మారుతుందా లేదా అనేది కాంగ్రెస్ ఇచ్చే కౌంటర్ అటాక్‌పై ఆధారపడి ఉంటుంది. నీటి ప్రాజెక్టుల సందర్శనలు, క్షేత్రస్థాయి పోరాటాలతో ప్రజలను నమ్మించగలిగితేనే బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. లేకపోతే బీఆర్ఎస్ ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని క్లారిటీ వచ్చేస్తుంది. అదే జరిగితే బీఆర్ఎస్ ఉనిక కష్టమవుతుంది.
