కేంద్రానికి అవ‌కాశ‌మిచ్చామ‌ని కేసీఆర్ మ‌థ‌న‌ప‌డుతున్నారా..?

స‌మ్మె చేస్తున్న‌వారంతా సెల్ఫ్ డిస్మిస్ అయిపోయిన‌ట్టే, ఐదు లోపు ఉద్యోగాల్లో చేరేందుకు అవ‌కాశం ఇస్తున్నాం, కోర్టు ఏం చేస్త‌ది కొడ‌త‌దా… ఆర్టీసీ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలా మొద‌ట్నుంచీ ఒక‌ర‌క‌మైన మొండి వైఖ‌రి అవ‌లంభిస్తూనే వ‌చ్చారు! ఇప్పుడు అదే త‌ల‌నొప్పిగా మారి, అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరిగేలా చేసింది. రూట్ల ప్రైవేటీక‌ర‌ణ‌పై కేబినెట్ తీర్మానం మీద హైకోర్టు స్టే ఇవ్వ‌డంతో… మంత్రి పువ్వాడ అజ‌య్, ఆర్టీసీ ఎండీతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. స్టే ఇవ్వ‌డంపై ముఖ్య‌మంత్రి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం! రూట్ల ప‌ర్మిట్ల గురించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌నీ, తీర్మానం కూడా పాస్ చెయ్య‌న‌ప్పుడు ఈ అంశం మీద న్యాయ‌స్థానం ఎలా స్టే ఇవ్వ‌గ‌ల‌ద‌ని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. హైకోర్టులో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే, వెంట‌నే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి రావొచ్చ‌నీ, దానికి అనుగుణంగా సిద్ధంగా ఉండాలంటూ అధికారుల‌కు సీఎం చెప్పిన‌ట్టు స‌మాచారం. ఆర్టీసీ స‌మ్మె అంశం, రూట్ల‌ను ప్రైవేటీక‌రించే అంశం… ఈ రెండూ న్యాయ‌స్థానం పరిధిలోకి వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు మ‌నం ఏం చెయ్య‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని సీఎం వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది!

కేంద్రం కూడా తెలంగాణ ఆర్టీసీ స‌మ్మెలో జోక్యం చేసుకోవడానికి కావాల్సిన మార్గాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చూపించింద‌ని చెప్పొచ్చు! ఆర్టీసీకి కేంద్రానికి కూడా 33 శాతం వాటా ఉంద‌నే వాద‌న‌ను త‌మ‌కు అనుకూలంగా మాట్లాడేందుకు కేసీఆర్ తెర‌మీదికి తెచ్చారు. గ‌త నెల‌లో ఇదే అంశాన్ని ప్ర‌స్థావిస్తూ కేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు. ఈనెల 2న కేబినెట్ నిర్ణ‌యం స‌మ‌యంలో కూడా సీఎం మాట్లాడుతూ…. ఆర్టీసీ మీద కేంద్రానికీ బాధ్య‌త ఉందనీ, కానీ వారు స్పందించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. సంస్థ న‌ష్టాల్లో ఉంది కాబ‌ట్టి, వాటిని కేంద్ర‌మూ భ‌రించాల‌ని అడుతామ‌న్నారు. ఇదే వాద‌న‌ను కోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్ల‌డంతో… కేంద్రానికి కూడా న్యాయ‌స్థానం నోటీసులు ఇచ్చేసింది. ఇప్పుడు కేంద్రం స్పందించాల్సిన ప‌రిస్థితి! కేంద్రం వాటా గురించి అన‌వ‌స‌రంగా మాట్లాడేశామ‌నీ, లేఖ‌లు రాసేశామ‌నీ, ఇప్పుడు కేంద్రం జోక్యానికి అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యిందంటూ కొంద‌రు ఉన్న‌తాధికారులు సీఎం ముందు ప్ర‌స్థావించిన‌ట్టు స‌మాచారం.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆర్టీసీ విభ‌జ‌న ఇంకా జ‌ర‌గ‌లేదు. ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య ఆర్టీసీ ఆస్తుల పంప‌కాల‌పై ఏకాభిప్రాయం కుద‌ర్లేదు. కాబ‌ట్టి, ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌కు చెల్లుబాటు లేద‌నే వాద‌న ఇప్పుడు తెర‌మీద‌కి వ‌చ్చింది. ఇక్క‌డ కూడా కేంద్రం జోక్యానికి ఆస్కారం ఉంది. ఆస్తుల విభ‌జ‌న అంశ‌మై ఆంధ్రా, తెలంగాణ‌ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోతే… కేంద్రం జోక్యం చేసుకునే అవ‌కాశాన్ని విభ‌జ‌న చ‌ట్ట‌మే ఇచ్చింది. ఇలా ఎటువైపు నుంచి కూడా కేంద్రానికి ఇప్పుడు ఛాన్స్ ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఎటువైపు చూసినా కేంద్రాన్ని మ‌ధ్య‌లోకి లాగిన‌ట్టుగానే ప‌రిస్థితి మారింద‌ని అనిపిస్తోంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com