కీరవాణి…. అచ్చతెనుగు సంగీత దర్శకుడు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా తనదైన మార్క్ చూపిస్తాడు. బాహుబలిలాంటగి పెద్ద సినిమాలకు పని చేస్తూ కూడా చిన్న సినిమాల్ని వదల్లేదు. అదే ఆయన గొప్పదనం. ఈ శుక్రవారం విడుదలైన `జువ్వ`కీ ఆయనే సంగీతం అందించారు. కీరవాణి పాటలు కదా, భలే ఫ్రెష్‌గా ఉంటాయిలే అని థియేటర్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడి ఆశల్ని ఆవిరి చేశాడు కీరవాణి. ఒక్కటంటే ఒక్క పాట కూడా కీరవాణి మార్క్‌లో వినిపించలేదు. నేపథ్య సంగీతం కూడా ఏదో ఆసక్తి లేనట్టు చేశాడు. పాటలు వింటున్నా, ఆర్ ఆర్ వస్తున్నా `ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడా` అనే డౌటు కూడా వస్తుంది. అలాగని ఈ సినిమాకి ఆయన పారితోషికం ఏమీ తగ్గించలేదు. నిర్మాతలు రూ.50 లక్షలు సింగిల్ పేమెంట్‌తో సెట్ చేశారు. ఆ డబ్బుల్లో సగం ఏ సాయికార్తీక్ చేతిలో పెట్టినా… ఇంతకంటే మంచి సంగీతమే ఇచ్చేవాడు. ఈ మాత్రం దానికి దర్శకుడు త్రికోఠి.. ‘ఈ సినిమా ఒప్పుకున్న కీరవాణి నాకు దేవుడుతో సమానం’ అంటూ… ఆడియో ఫంక్షన్లో భజన చేశాడు. కథ నచ్చకపోతే కీరవాణి సంగీతం చేయడు… అని బలంగా నమ్మేవారు ఆయన అభిమానులు. కానీ.. ‘జువ్వ’లాంటి సినిమాలు, అందులో పాటలు చూస్తుంటే.. కీరవాణి పారితోషికాల గురించి కూడా సినిమాలు చేస్తాడనిపిస్తోంది. ఆయన బ్రాండ్ వాల్యూ పడిపోవడానికి తప్ప ఇలాంటి సినిమాలు ఎందుకూ ఉపయోగపడవు. ఆ నిజం కీరవాణికి తెలిసేదెలా??