రాజమౌళి ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట దేశానికి ఆస్కార్ తీసుకురావాలని దేశవ్యాప్తంగా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఆస్కార్ అనేది సినీ ప్రపంచపు అతి గొప్ప స్వప్నం. ఆ కల సాకారానికి అతి దగ్గరలో ఉంది ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందం. ఆస్కార్ పురస్కారాల్లో ఐదు పాటల్లో ఓ నామినేషన్‌ని కైవశం చేసుకుని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్ .
ఇప్పుడు మరో అనందమైన వార్త అందింది. మార్చి 12న జరగనున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ పాటను ప్రత్యక్షంగా ప్రదర్శించమని సంగీత దర్శకుడు కీరవాణికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపిందని సమాచారం. విజేతగా నిలవడానికి ఇది చాలా గొప్ప సానకూల పరిణామం.
గతంలో ఏఆర్.రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’లోని ‘‘జయహో’’ పాటని లైవ్ లో ప్రదర్శించమని ఆస్కార్ అకాడమీ కోరింది. తర్వాత వేదికపై అవార్డ్ ఇచ్చారు. ఇలా అవార్డ్ వచ్చిన పాటకే లైవ్ లో ప్రదర్శించమని ఆస్కార్ అకాడమీ కోరుతుందని ట్రాక్ రికార్డ్ చెబుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. తెలుగు సినిమా ఆస్కార్ కల నెరవేరినట్లే.