మేం బురద చల్లుతాం….మీరు కడుక్కోండి…ఇదీ మన రాజకీయ నేతల స్టైల్. చాలా సీిరియస్ వ్యవహారమైన అవినీతిని కూడా ఇలాంటి బురదజల్లుడు కార్యక్రమాలతోనే కామెడీ చేసి పడేశారు. జగన్ లక్ష కోట్లు తిన్నాడని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల సమయం వచ్చేసరికి ఆ లక్ష కోట్లను ఇంచుమించుగా పదహారు లక్షల కోట్లకు తీసుకెళ్ళారు టిడిపి నేతలు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచీ కూడా వైఎస్ జగన్, సాక్షి పేపర్ చెప్పే మాటలన్నీ లక్షల కోట్ల అవినీతి చుట్టూనే తిరుగుతున్నాయి. అది అమరావతి వ్యవహారం అయినా, పోలవరం ప్రాజెక్ట్ అయినా లేదా వేరే ఏ పెద్ద విషయం అయినా కూడా లోకేష్‌బాబు, చంద్రబాబు లక్ష కోట్లు నొక్కేశారని ఆరోపించడం జగన్‌కి భలే సరదా. మరీ లక్ష కోట్లు అంటే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమానం అని జనాలు భావిస్తారని అనుకుంటాడో ఏమో తెలియదు కానీ లక్షా పాతిక వేల కోట్లు అని, లేకపోతే ఆ నంబర్‌కి ఇంకో పాతిక వేల కోట్లు కలిపేసో ఆరోపణలు చేస్తూ ఉంటాడు. అధినేతల విషయమే ఇలా ఉంటే ఇక మిగతా నేతల తీరు ఎలా ఉంటుంది? చిత్తం వచ్చినట్టుగా మాట్లాడే నేతల్లో తెలుగువారి వరకూ చూసుకుంటే ముందుగా జెసి దివాకర్‌రెడ్డి కనిపిస్తాడు. ఏ పార్టీలో ఉన్నాను? ఏ పదవిలో ఉన్నాను? అనే విషయాలతో సంబంధం లేకుండా పాకిస్తాన్‌తో యుద్ధం, కాశ్మీర్ విషయాల నుంచి అంతర్జాతీయ విషయాల వరకూ తన నోటికి వచ్చింది మాట్లాడేస్తూ ఉంటాడు. ఈ సో కాల్డ్ రాజకీయ నాయకులందరూ ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడే మాటలను జబర్ధస్త్ జోకులుగా తీసుకుని నవ్వుకుంటూ ఉంటారు జనాలు.
అయితే రాజకీయాలను మార్చేస్తా అంటూ దూసుకొచ్చేసిన కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా రెగ్యులర్ రాజకీయ నాయకుల్లాగే మాట్లాడుతూ ఉండడం మాత్రం… వ్యవస్థలో ఎప్పటికైనా మార్పు వస్తుంది అన్న ఆశతో ఉన్నవాళ్ళను నిరాశపరుస్తోంది. ఢిల్లీ హై కోర్టు 50 సంవత్సరాల వేడుకలో పాల్గొన్న కేజ్రీవాల్….సుప్రీం కోర్ట్, హై కోర్ట్, జిల్లా కోర్టుల న్యాయమూర్తుల ఫోన్స్‌ని ట్యాప్ చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేశాడు. అది చాలా ప్రమాదకరమని కూడా వ్యాఖ్యలు చేశాడు. చివరగా అలా జరుగుతోందని చెప్పి కొంత మంది జడ్జ్‌లు కూడా మాట్లాడుతున్నారని చెప్పి జర్నలిస్ట్‌ల తెలివితేటలు కూడా వాడేశాడు కేజ్రీ. అయితే జడ్జ్‌ల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారన్న విమర్శ లక్ష కోట్ల అవినీతి లాంటి కామెడీ విషయం కాదు. అందుకే కేజ్రీవాల్ మాటలకు వెంటనే రెస్పాన్స్ వచ్చింది. ఏ ఏ జడ్జ్‌ల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారో, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలేంటో చెప్పమని కేజ్రీవాల్‌కి ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ వర్మ లెటర్ రాశారు. లేఖపై స్పందించిన కేజ్రీవాల్….‘ఇంటెలిజెన్స్ బ్యూరోని అడగండి…వాళ్ళు మీకు చెప్తారు’ అంటూ కామెడీగా, బాధ్యతారాహిత్యంగా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
బిజెపి, కాంగ్రెస్‌లాంటి బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొని ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సాధించిన అద్భుత విజయం, ఆ తర్వాత పాలన విషయంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులకంటే మెరుగ్గా ఉండటం లాంటి గొప్ప అంతా కూడా మోడీపైన కోపంతో కేజ్రీవాల్ చేస్తున్న ఇలాంటి చీప్ పాలిటిక్స్‌తోనే గంగలో కలిసిపోతోంది. జెసి దివాకర్‌రెడ్డిలాంటి వాళ్ళకు కేజ్రీవాల్‌కి తేడా లేకుండా పోయేలా చేస్తోంది. ఆరోపణలు కేజ్రీవాల్ చేస్తాడట, నిరూపించాల్సిన బాధ్యత మాత్రం వేరెవరిదో అట. ఆల్రెడీ కేజ్రీవాల్ తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి ఆధారాల్లేకుండా చాలా సీరియస్ వ్యవహారాలపైన కూడా నోటికి వచ్చినట్టుగా కామెడీగా కామెంట్స్ చేస్తున్న ఇలాంటి తీరుతోనే కేజ్రీవాల్ క్రేజ్ రోజు రోజుకూ పతనమవుతోంది. నిన్న సర్జికల్ స్ట్రైక్స్, ఇప్పుడు జడ్జ్‌ల ఫోన్స్ ట్యాపింగ్……కేజ్రీవాల్ మాటల తీరు ఇలానే ఉంటే మాత్రం ఆయన రాజకీయ పతనాన్ని ఆయనే కొని తెచ్చుకోవడం ఖాయం.