కేరళ అసెంబ్లీ ఎన్నికలపై గల్ఫ్ యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. కేరళ నుంచి పెద్ద ఎత్తున గల్ఫ్ కు ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన వారు ఉన్నారు. అక్కడ ఉన్న ఎన్నాళ్లలో అరవై శాతం కేరళ వారే ఉంటారు. వారిలో అత్యధికం ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లేసి పోతూంటారు. ఈసారి స్వదేశానికి చేరుకోవడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. విమాన సర్వీసులు లేకకపోవడమే కారణం.
నిర్ణయాత్మక శక్తిగా గల్ఫ్ ఓటర్లు
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 50 నుండి 60 స్థానాల్లో గల్ఫ్ ఓటర్ల ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా మలప్పురం, కోజికోడ్, కన్నూర్, పతనంతిట్ట వంటి జిల్లాల్లో గల్ఫ్ నుంచి వచ్చే ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 25 లక్షల మంది మలయాళీలు గల్ఫ్ దేశాల్లో నివసిస్తుండగా, అందులో దాదాపు 4 నుండి 5 లక్షల మంది ఓటు వేయడానికి కేరళకు వచ్చే అవకాశం ఉందని అంచనా.
ప్రత్యేక విమానాలు – పార్టీల వ్యూహం
గల్ఫ్ ఓటర్లను రప్పించేందుకు రాజకీయ పార్టీలు మునుపెన్నడూ లేని విధంగా కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ , లెఫ్ట్ కూటముల అనుబంధ సంస్థలు గల్ఫ్ దేశాల నుంచి చార్టర్డ్ విమానాల ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. యుద్ధం వల్ల కమర్షియల్ విమానాలు అందుబాటులో లేకపోతే, సొంత ఖర్చులతో ప్రత్యేక విమానాలను నడిపి ఓటర్లను పోలింగ్ రోజు నాటికి కేరళకు చేర్చాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందుకోసం దుబాయ్, ఖతార్, షార్జా వంటి నగరాల నుంచి ప్రత్యేక విమాన సర్వీసుల కోసం విదేశీ వ్యవహారాల శాఖతో చర్చలు జరుపుతున్నాయి.
గల్ఫ్ ఓటర్లు రాకపోతే కాంగ్రెస్‌కే దెబ్బ
గల్ఫ్ ఓటర్లు రాకపోతే అది ముస్లిం లీగ్,కాంగ్రెస్ కూటమికి కోలుకోలేని దెబ్బ కావచ్చని, ఎందుకంటే వారి ఓటు బ్యాంకులో మెజారిటీ గల్ఫ్ నుంచే వస్తుందని అంచనా. ఈ సంక్షోభాన్ని కూడా కేరళలో రాజకీయంగా వాడుకుంటున్నారు. గల్ఫ్ లో చిక్కుకున్న మలయాళీలను రప్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రవాసుల భద్రత కంటే ఓట్లపైనే పార్టీలకు ఆసక్తి ఎక్కువ ఉందని ఇతరులు విమర్శలు గుప్పిస్తున్నారు. కేరళ ఎన్నికల ఫలితాలు ఈసారి కేవలం రాష్ట్రంలోని ప్రచారంపైనే కాకుండా, పశ్చిమాసియాలోని యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై కూడా ఆధారపడి ఉన్నాయి. యుద్ధం కారణంగా గల్ఫ్ ఓటర్ల సంఖ్య 30-40 శాతం తగ్గినా, అది రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుంది.
