విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ వైరం సోమవారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం వేదికగా మరోసారి భగ్గుమంది. దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ చేతి నుంచి కొలికపూడి లాగేసుకుని తానే సమర్పించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు. అదే సమయంలో తలంబ్రాలను ఎమ్మెల్యే కొలికపూడికి ఇచ్చారు. అయితే, పట్టువస్త్రాలు తనకే ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యేగా ఆ గౌరవం తనకే దక్కాలని కొలికపూడి పట్టుబట్టి వాటిని ఎంపీ చేతుల నుంచి లాగేసుకున్నారు.
గొడవ ఇష్టం లేక ఎంపీ కేశినేని చిన్ని వెంటనే ఆ పట్టువస్త్రాలను ఎమ్మెల్యేకు ఇచ్చేసి నవ్వుతూ పక్కకు తప్పుకున్నారు. సామాన్య భక్తులతో కలిసి కింద కూర్చుని కల్యాణాన్ని వీక్షించగా, ఎమ్మెల్యే వేదికపై కూర్చుని కార్యక్రమాన్ని కొనసాగించారు. దేవుడి దగ్గర వివాదం రేగకుండా పట్టువస్త్రాలను కొలికపూడి లాక్కున్నా.. కింద కూర్చుని కల్యాణం చూసి స్వామి వారికి పూజలు చేసుకుని ఎంపీ వెళ్లిపోయారు.కానీ పట్టు వస్త్రాలు లాక్కున్న కొలికపూడి తీరుపై మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆయన పూర్తిగా విచక్షణ కోల్పోయారని .. ఏం చేస్తున్నారో ఆయనకే తెలియని స్థితికి వెళ్లిపోయారన్న నిట్టూర్పు టీడీపీలో వినిపిస్తోంది.
