ఉర్సా క్లస్టర్స్ కు భూమి కేటాయింపులపై ఇప్పుడు వివాదం జరుగుతోంది. ఈ వివాదంలోకి కేశినేని నాని వచ్చారు. ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ ఎవరిదన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేశినేని నాని చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు భూమి కేటాయించడం అద్భుతం కానీ.. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాల భూమి కేటాయింపు మాత్రం కరెక్ట్ కాదన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రూపొందించిన బినామీ కంపెనీ అని నాని ఆరోపించారు.
ఉర్సా క్లస్టర్స్ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ విజయవాడ ఎంపీకి కాలేజీ మేట్. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రాడ్‌లో కూడా భాగంగా ఉన్నాడని నాని తెలిపారు. పెట్టుబడి ముసుగులో ఈ భూ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని కోరారు. కంపెనీ యాజమాన్యం, నిధుల మూలం మరియు రాజకీయ సంబంధాలపై వివరణాత్మక విచారణకు ఆదేశించాలని.. అవినీతి ప్రయోజనాల కోసం మీ నాయకత్వాన్ని మరియు పార్టీ పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేశినేని శివనాత్ పై నాని ఇంకా పలు ఆరోపణలు చేశారు. ఇసుక, బూడిద, కంకర మైనింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాలలో ఆయన ప్రమేయం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు.ల నారా లోకేష్ పేరును బహిరంగంగా దుర్వినియోగం చేస్తూ ఈ పనులు చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ యంత్రాంగాలను ఉపయోగించి రహస్యంగా భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. కేశినేని నాని సోదరుడే కేశినేని శివనాథ్.