ప్రాంతీయ పార్టీలదే నిర్ణయం! “ఫెడరల్” ప్రభుత్వం అసాధ్యం?

బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర పార్టీలు 2009, 2014 ఎన్నికల్లో 220 వరకూ లోక్ సభా స్ధానాల్లో గెలుపొందాయి… కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లేని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పరచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో వున్నామని కేసీఆర్ చెబుతూండటం వెనుక ఈ అంకెలే కనిపిస్తూ వుండవచ్చు. 2009, 2014 ఎన్నికల నాటి పరిస్ధితులు స్ధూలంగా మారలేదని అందువల్ల తక్కువలో తక్కువ 220 సీట్ల “ఇతర” పార్టీలకు వచ్చే అవకాశం వుందని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు అర్ధమౌతున్నది. అలా జరిగినా కూడా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 కోసం బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతు ఎవరికైనా అనివార్యం! కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ యేతర, కాంగ్రెసేతర ప్రభుత్వ స్థాపన జరిగే పని కాదని ఈ గణిత శాస్త్రం లెక్కతేల్చేస్తున్నది.

అయితే ప్రభుత్వాన్ని నిర్ణయించడంలో ప్రాంతీయ పార్టీలదే ముఖ్యపాత్ర అవుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 100 నుంచి 120 స్ధానాలు కోల్పోవచ్చు అన్న అంచనా అనేక రాజకీయ వర్గాలనుంచి వినబడుతున్నది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 లోక్ సభ స్థానాలను గెలవాలి. 2014 లో సొంతంగా 282 స్థానాలను సాధించుకున్న బీజేపీ, మిత్రపక్షాల బలంతో కలిపి మొత్తం 336 సీట్లతో నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్ డి ఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాల ఫలితాలను బట్టి చూస్తే బీజేపీకి ఈ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 65 లోక్ సభ సీట్లకు గతంలో లాగా 62 సీట్లు వచ్చే అవకాశాలు లేవని కనీసం సగం సీట్లు బీజేపీ కోల్పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

బీహార్‌లో గతంలో గెలుచుకున్నట్లు 22, జార్ఖండ్‌లో 12 సీట్లు వచ్చే అవకాశాలు తక్కువ. ఢిల్లీలో 7కు 7 సీట్లు మరో సారి రావడం అసాధ్యం. స్థూలంగా చూస్తే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్‌, రాజస్థాన్, బిహార్, గుజరాత్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లోనే బీజేపీ గత ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకోగా ఈసారి 100 స్థానాలు కూడా గెలుచుకోవడం కష్టంగా కనపడుతోంది.

కర్ణాటకలో లోక్ సభలో కూడా కాంగ్రెస్ – జేడిఎస్ కలిసి పోటీ చేస్తూండటం వల్ల గతంలో మాదిరి 17 సీట్లు వచ్చే అవకాశమే లేదు. అయితే ఒడిషా, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీకి గతంలో రాని సీట్లలో ఈసారి 20 సీట్లకు పైగా లభించే అవకాశాలున్నాయంటున్నారు. బీజేపీకి 2004లో 138 సీట్లు, 2009లో 116 సీట్లు వచ్చాయి. ఈ సారి 2014 నాటి సంఖ్య రాకపోయినా అంతకుముందు రెండు ఎన్నికల కంటే ఎక్కువ లోక్ సభా స్ధానాలనే గెల్చుకుంటుంది.

లోక్ సభలో గత కొన్నేళ పరిస్థితిని గమనిస్తే బీజేపీ, కాంగ్రెస్ కలిసి దాదాపు 320 – 330 స్థానాలు సంపాదించుకుంటున్నాయి.

దేశంలో బలంగా ఉన్న వామపక్షాలు 2004 వరకూ అవి దేశ రాజకీయాల్లో కీలక భూమికను పోషించగలిగాయి. 2009 నుంచి వామపక్షాల స్థానాన్ని ఇతర ప్రాంతీయ పార్టీలు భర్తీ చేస్తున్నాయే కాని కాంగ్రెస్, బీజేపీలు చేయడం లేదు. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి 2009 ఎన్నికల్లో 322 స్థానాలు రాగా, 2014 ఎన్నికల్లో 326 స్థానాలు లభించాయి. అంటే ఈ రెండు ఎన్నికల్లోనూ దాదాపు 220 స్థానాలు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు సాధించాయన్నమాట. బీజేపీ సంఖ్యాబలం 150 – 160కి పడిపోతే కాంగ్రెస్ కూడా దాదాపు అన్నే స్థానాలు సంపాదించుకుంటుందని ఈ లెక్కల్ని బట్టి చెప్పవచ్చు.

ఒకవేళ అన్ని స్థానాలు సంపాదించలేకపోయినా ఉత్తర ప్రదేశ్‌లో బిఎస్‌పీ, ఎస్‌పి, ఢిల్లీలో ఆప్, బిహార్‌లో ఆర్‌జెడి వంటి పార్టీలు బీజేపీ వ్యతిరేక పార్టీలే కనుక అవి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల బలాన్ని దాదాపు 250 స్థానాలవరకు తీసుకువెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండింటి సంఖ్యాబలం 300 లోపే ఉంటుంది.

ఈ పరిస్ధితిని విశ్లేషిస్తే 2019లో ప్రాంతీయ పార్టీలదే నిర్ణయాత్మక పాత్ర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల్లోని బీజేపీ వ్యతిరేక పార్టీల ప్రాబల్యమే ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, ఒడిషా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలే వచ్చే ఎన్నికల్లో దేశ భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయి. ఈ పార్టీల్లో ఒక్క శివసేన, అకాలీదళ్ మినహా బీజేపీతో ప్రత్యక్షంగా, చిరకాలం అంటకాగిన పార్టీలు పెద్దగా లేవు.

కనుక బీజేపీ, కాంగ్రెస్ బలాబలాల్ని బట్టి వచ్చే ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్న విషయం స్పష్టమవుతుంది.

ప్రాంతీయ పార్టీలు తమ మధ్య ఐక్యతను సాధించగలిగితే కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో అవి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు తప్పకపోవచ్చు.

బీజేపీ ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే మోదీని మళ్లీ ప్రధానిగా ఎంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలు ఇష్టపడకపోవచ్చు. మోదీకి ప్రత్యామ్నాయంగా ఎవరుంటారా అన్న విషయంపై ఇప్పటికే బీజేపీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

బీజేపీ నుంచి మరో నేతను ముందుకు నెట్టాలా, లేక బీజేపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టలా అన్నది “నాగపూర్” నిర్ణయిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com