రివ్యూ: ఖైదీ

Khaidi Review

తెలుగు360 రేటింగ్‌: 3/5

హీరోల‌కు క‌థ‌లు చెప్పేట‌ప్పుడు కూడా బిల్డ‌ప్పులు ఇవ్వ‌డం అవ‌స‌రం. సార్…. మ‌న సినిమాలో ముగ్గురు హీరోయిన్లండీ, ఒక్కో హీరోయిన్ తో రెండేసి పాట‌లండీ, ఏడెనిమిది ఫైట్లండీ.. సీను సీనుకూ మీరు నాలుగైదు కాస్ట్యూమ్స్ ఈజీగా తీసి అవ‌త‌ల పారేస్తుంటారండీ.. ఎంట్రీ సీనొచ్చేసి యూర‌ప్ లో తీద్దామండీ.. పాట‌లు మ‌లేసియాలో, ఫైటింగులు ర‌ష్యాలో… ఇలా చెబితే గానీ హీరోల‌కు కిక్ కాదు.

ఈ బిల్డ‌ప్పుల చుట్టూ క‌థ‌ని తిప్ప‌డంలో, సినిమాలోనూ, క్యారెక్ట‌రైజేష‌న్‌లోనూ అదే క‌నిపిస్తుంటాయి. కాస్త కింద‌కు దిగి, క‌థ‌ని భూమ్మీద నిల‌బెట్టి, హీరో అనేవాడ్ని అతి సామాన్యుడిగా చూపిస్తే, క‌ళ్ల ముందు జ‌రిగే స‌న్నివేశాల్లోంచి, సంఘ‌ట‌న‌ల్లోంచి క‌థ‌లు ఎంచుకుంటే – స‌హ‌జ‌త్వం ఎందుకు రాదు, ఎవ‌డి కోసం రాదు..?

కార్తీ ఇలానే ఆలోచించాడు. హీరో పాత్ర‌ని ద‌ర్శ‌కుడు అలానే డిజైన్ చేశాడు. అందుకే ఈరోజు `ఖైదీ` మ‌న ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాలో భారీ బిల్డ‌ప్పులేం లేవు. పాట‌ల్లేవు. రొమాన్స్ లేదు. కావ‌ల్సినంత డ్రామా ఉంది. సంఘ‌ర్ష‌ణ ఉంది. ఉత్కంఠ‌త ఉంది. ఎప్పుడైతే అద‌న‌పు హంగులు తీసేశాడో.. అప్పుడు అస‌లైన రూపం చూపించ‌డానికి ద‌ర్శ‌కుడికి వీలైనంత స్కోప్ దొరికింది. దాన్ని తెలివిగా వాడుకున్నాడు.

డిల్లీ (కార్తీ) అనే ఖైదీ క‌థ ఇది. ప‌దేళ్ల త‌ర‌వాత జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. త‌న కూతుర్ని చూడాల‌న్న ఆశ‌. త‌నెక్క‌డో అనాథాశ్ర‌మంలో ఉంది. తండ్రికి కూతురు ఎలా ఉంటుందో తెలీదు. ఆ కూతురికి తండ్రి ఉన్నాడో లేదో కూడా తెలీదు. కూతుర్ని చూడాల‌న్న ఆశ‌తో బ‌య‌ల్దేరిన తండ్రి కి… ఓ పోలీసుకి స‌హాయం చేయాల్సివ‌స్తుంది. చిన్న సాయ‌మే. ఓ లారీలో ఎన‌భై కిలోమీట‌ర్లు తీసికెళ్లి, చెప్పిన ప్ర‌దేశంలో దింపాలి. కానీ… వైకుంఠ‌పాళీలా మ‌ధ్య మ‌ధ్య‌లో మింగేసే పాములు బోలెడ‌న్ని వ‌స్తుంటాయి. అవ‌న్నీ దాటుకుంటూ, నిచ్చెన మెట్లెక్కుతూ, పాముకి దొరికిపోతూ, అల‌సిపోతూ, పోరాడుతూ, పారిపోతూ.. ఓ ప్రయాణం చేయాల్సివ‌చ్చింది. ఈక‌థ‌ని ఎనిమిది వందల కోట్ల విలువైన డ్ర‌గ్స్ మాఫియాతో ముడిపెడుతూ.. క‌థ‌నం న‌డిపాడు. అదెలా సాగిందో, త‌ర‌వాత ఏమైందో తెలియాలంటే… ఖైదీ చూడాలి.

ఈ క‌థ‌లో చాలా పొర‌లున్నాయి. ఓతండ్రి కూతురు కోసం ప‌డే ఆరాటం ఉంది. ఓ కానిస్టేబుల్ త‌న వృత్తి ప‌ట్ల చూపించిన నిబ‌ద్ధ‌త ఉంది. కొంత‌మంది విద్యార్థులు ఓ పోలీస్ స్టేష‌న్‌ని కాపాడ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం ఉంది. ఓ అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్‌.. ప్రాణ త్యాగం ఉంది. ఇన్ని కోణాల్లో ఓ క‌థ చెబుతూ, నాలుగ్గంటల వ్య‌వ‌ధిలో జ‌రిగిన క‌థ‌లా చూపించ‌డం అంటే మాట‌లు కాదు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నాన్ని, కృషి నీ మెచ్చుకోవాల్సిందే.

ఓ రాత్రి జ‌రిగే క‌థ ఇది. కాస్ట్యూమ్ మార్చాల్సిన ప‌నిలేదు. రా లుక్‌లో క‌నిపించాలి. హీరోయిన్ లేదు… ఇలాంటి క‌థలు మ‌న‌కు అవ‌స‌ర‌మా? అనుకోకుండా.. కార్తీ గొప్ప సాహ‌సం చేశాడు. త‌నకంటూ ఓ స‌మస్య వ‌స్తే, దానిపై పోరాటం చేయ‌డంలో ఓ హీరోయిజం ఉంటుంది. త‌న‌ది కాని స‌మస్య‌ని నెత్తిమీద పెట్టుకుని ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి ఎదురీద‌డంలో అంత‌కంటే ఎక్కువ హీరోయిజం క‌నిపిస్తుంది. ఖైదీ ప్ల‌స్ పాయింట్ అదే. సినిమా మొదలైన 15 నిమిషాల వ‌ర‌కూ హీరో క‌నిపించ‌డు. అయినా సరే.. హీరోని చూడాలన్న ఆత్రం కంటే…. తరవాత ఏం జరుగుతుందా? అనే ఆలోచ‌నే ఎక్కువ‌గా క‌లుగుతుంది. ద‌ర్శ‌కుడి తొలి విజ‌యం అది. హీరో పాత్ర‌ని మెల్ల మెల్ల‌గా ఎలివేట్ చేసుకుంటూ, మ‌రోవైపు స‌మ‌స్య‌ని తీవ్ర‌త‌రం చేసుకుంటూ వెళ్లాడు. అనుకోని స‌మ‌స్య‌లో ప‌డి పాత్ర‌ల‌న్నీ లాక్ పడిపోయాయి. ఎన‌భై కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేసి, ఎస్ పీ ఆఫీసుకి చేరుకోవ‌డానికి హీరో బృందం చేసే ప్ర‌య‌త్నం ఇది. వీళ్లే వెళ్ల‌డం ఎందుకు…? ఎస్‌పీ ఆఫీసు ద‌గ్గ‌ర‌కు భారీ బందోబ‌స్తుని పంపితే.. స‌రిపోతుంది క‌దా? అనే ఆలోచ‌న వ‌స్తే… క‌థ అక్క‌డితో పుల్ స్టాప్ ప‌డిపోయిన‌ట్టే. కానీ.. ఆ ఆలోచ‌న రానంత‌గా లాజిక్కులు వేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. హీరో తో పాటు చాలా పాత్ర‌లు ఈ క‌థ‌లో ఇరుక్కుపోతాయి. వాటిని అలా ఇరకాటంలో ప‌డేసే విష‌యంలో ద‌ర్శ‌కుడు త‌న తెలివి తేట‌ల్ని చూపించాడు. అప్పుడే ట్రాన్స్ ఫ‌ర్ అయి డ్యూటీలోకి చేరిన కానిస్టేబుల్ పాత్ర‌, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దిరికి, పోలీస్ స్టేష‌న్‌లో చిక్కుకున్న స్నేహితుల బృందం – వాళ్లు కూడా ఈ క‌థ‌లో త‌మ వంతు పాత్ర పోషించారు. మ‌రో వైపు దిల్లీ త‌న కూతుర్ని క‌లుస్తాడా లేదా? అనే స‌స్పెన్స్ ని కొన‌సాగించాడు. ఒకానొక సంద‌ర్భంలో తండ్రీ కూతుర్లు క‌లుసుకోరేమో అనే భ‌యం క‌లుగుతుంది. ఎందుకంటే త‌మిళ సినిమాల్లో కొన్ని క‌థలు విషాదాంతాలుగా ముగుస్తాయి. ఈ క‌థ‌నీ అలానే చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ.. ఆ జోలికి వెళ్ల‌కుండా – ఓ సంతృప్తిక‌ర‌మైన ముగింపు ఇచ్చాడు.

చెప్పాల్సిన అంశాలు చాలానే ఉన్నా, క‌థ మాత్రం చిన్న‌ది. పైగా నాలుగు గంట‌ల నిడివితో సాగే క‌థ ఇది. దాన్ని గ్రిప్పింగ్ గా చెప్ప‌డం అంటే మాట‌లు కాదు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయినా, ద్వితీయార్థంలో అక్క‌డ‌క్కడ కాస్త విసిగిస్తాడు. యాక్ష‌న్ డోసు ఎక్కువైన ఫీలింగ్ క‌లుగుతుంది. అప్ప‌టి వ‌ర‌కూ సాదాసీదాగా క‌నిపించిన హీరో, ప‌దుల సంఖ్య‌లో భారీకాయుల్ని మ‌ట్టిక‌రిపించ‌డం చూస్తే.. మ‌ళ్లీ పాత ఫార్ములాలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది. అయితే ప‌తాక స‌న్నివేశాల్ని కాస్త బాగా రాసుకోవ‌డంతో… సినిమా మ‌ళ్లీ తేరుకుంది.

కార్తీ ఈ సినిమాతో ఫామ్ లోకి వ‌చ్చిన‌ట్టే క‌నిపించింది. త‌న‌కు మాత్ర‌మే సూట‌య్యే పాత్ర అనిపించింది. వీర మాస్ లెవిల్లో భోజ‌నం చేసే సీన్‌, త‌న కూతురు కోసం త‌పించే స‌న్నివేశాలు, చివర్లో కూతురు క‌నిపించ‌గానే ఉద్వేగ ప‌డిన సంద‌ర్భాల‌లో…కార్తీ న‌ట‌న త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. న‌రేన్ కి మంచి పాత్ర ప‌డింది. త‌ను కూడా చ‌క్క‌గా ఇమిడిపోయాడు. కానిస్టేబుల్ పాత్ర కూడా గుర్తుండిపోతుంది.

చాలా `రా`గా సాగే సినిమా ఇది. అక్క‌డ‌క్క‌డ జియో సిమ్ డైలాగులు కొన్ని పేలాయి. చివ‌ర్లో మిష‌న్ గ‌న్‌తో కార్తీ రెచ్చిపోయే సీన్ కూడా బాగా పండింది. సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు కొన్ని స‌ర‌దా డైలాగులు రాసుకున్నా, క‌థ‌లో సీరియస్ ఎమోష‌నే ఎక్కువ‌. రాత్రి జ‌రిగే క‌థ కాబ‌ట్టి, కెమెరా మెన్‌కి చాలా ప‌ని ప‌డింది. చీక‌టి కూడా ఎమోష‌న్‌లో ఓ భాగంగా మారింది. నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల్ని మ‌రింత ర‌క్తి క‌ట్టించింది. ద‌ర్శ‌కుడికి ఇది రెండో సినిమా. అయినా స‌రే, చాలా ప‌ర్‌ఫెక్ట్ గా స్క్రిప్టు రాసుకోగ‌లిగాడు.

తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు అల‌వాటైన ఫార్ములా ఈ క‌థ‌లో క‌నిపించ‌దు. నేప‌థ్యం పూర్తిగా కొత్త‌గా ఉంటుంది. యాక్ష‌న్ మోడ్‌లో సాగే రియ‌లిస్టిక్ డ్రామా ఇది. మాస్ మ‌సాలా సినిమాలు బోర్ కొట్టిన‌వాళ్ల‌కు క‌చ్చితంగా ఈ ఖైదీ న‌చ్చుతాడు.

తెలుగు360 రేటింగ్‌: 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి ఇంకెంత మంది బయటకు..!?

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ...

“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త...

కేసీఆర్‌కు రామ్‌మాధవ్ బెదిరింపులేంటో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో... కాళేశ్వరం నిర్మాణ...

జగన్ పట్టుబట్టినా కర్ణాటకకే “మందాకిని”..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రానికి ఎంతగా సహకరిస్తున్నా... ఢిల్లీ సర్కార్ మాత్రం.. ఏపీ ప్రయోజనాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీకి కేంద్రం కేటాయిస్తుందని ఆశలు పెట్టుకున్న మందాకిని బొగ్గు గనిని కర్ణాటకకు...

HOT NEWS

[X] Close
[X] Close