రివ్యూ: విజిల్

Bigil Review

తెలుగు360 రేటింగ్‌: 3/5

ఈ సినిమాలో ఓ సన్నివేశం… హీరో స్టైల్ గా సైకిల్ చైన్ తెంపుతాడు..అది చూసిన హీరో అనుచరుడు `ఇది రొటీనే కదా` అంటాడు. కానీ వర్కవుట్ అవుతుంది… మినిమం గ్యారెంటీ అని హీరో బదులిస్తాడు. దాన్ని బట్టి ఈ సినిమాపై ముందే ఓ అంచనాకు వచ్చేయొచ్చు.

సినిమా తీయడం రెండు రకాలు. ఒకటి… దర్శకుడి అభిరుచిని ప్రదర్శిస్తూ సినిమా తీయడం. రెండోది… చూసేవాళ్లకు ఏం కావాలో అవన్నీ ఉండేలా చూసుకుంటూ హీరో ఇమేజ్ ని క్యారీ చేస్తూ.. ఫ్యాన్స్ కి ఏం కావాలో అవన్నీ అందించేస్తూ అన్ని వర్గాల్నీ సంతోషంగా థియేటర్ల నుంచి సాగనంపడం. దర్శకుడిని నచ్చిందే తీయడంలో రిస్కు ఉంటుంది. కానీ హిట్టయితే… ఆ సినిమాకి ఇక తిరుగుండదు. రెండో ఫార్మెట్లో.. మినిమం గ్యారెంటీ ఉంటుంది. `విజిల్` కోసం అట్లీ ఎంచుకున్న దారి ఇదే.

విజయ్ ఫ్యాన్స్ కోసం.. కేవలం విజయ్ ఫ్యాన్స్ కోసం ఓ విజయ్ అభిమానిలా తీసిన సినిమా.. ‘విజిల్’.

కథగా అట్లీ చేసిన ప్రయోగం ఏమీ లేదు. ఓ స్పోర్ట్స్ డ్రామాకు, గ్యాంగ్ స్టర్ నేపథ్యం జోడించాడు. అది కూడా తెలివిగా. ఓ ఫుట్ బాల్ టీమ్ కి కోచ్ మన హీరో. అసలే ఫుట్ బాల్ అంటే మన దేశంలో ఆదరణ లేదు. దానికి తోడు మహిళా జట్టు. ఏమాత్రం అంచనాలు లేకుండా టోర్నమెంటులో దిగిన జట్టుని.. హీరో ఎలా ఛాంపియన్ గా మలిచాడు అన్నదే కథ. దీన్ని ఇలానే తీస్తే చక్ దే ఇండియానే మళ్లీ తీశారేంట్రా అంటారు. అందుకని అట్లీ తెలివిగా… దానికో గ్యాంగ్ స్టర్ నేపథ్యం జోడించాడు. హీరో తండ్రి (విజయ్)కి ఓ కల ఉంటుంది. తన కొడుకుని ఛాంపియన్ గా చూడాలని. తాను ఛాంపియన్ అవ్వకపోయినా, తన జట్టుని ఛాంపియన్ గా నిలబెట్టి, తండ్రి కోరికని నెరవేరుస్తాడు హీరో. స్థూలంగా అదే కథ.

అట్లీ చేసిన మంచి పని ఏమిటంటే.. ఈ కథలో అన్ని ఎమోషన్లూ ఉండేలా చూసుకోవడం. విజయ్ ఫ్యాన్స్ ని నచ్చే ఎలిమెంట్స్ తో కథ మొదలెట్టాడు. అందులో ఓ స్పోర్ట్స్ డ్రామాని మిక్స్ చేశాడు. అమ్మాయిలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఫోకస్ పెట్టాడు. మహిళా సాధికారికత గురించి మాట్లాడాడు. వీటితో పాటు.. అప్పుడప్పుడూ హీరోయిజం చూపించే సన్నివేశాలకు లోటు రాకుండా చూసుకున్నాడు. విజయ్ సినిమాలో ఏమేమి ఉంటాయని ఆశిస్తారో అవన్నీ ఇచ్చేసి, వాటి మధ్య కథని చెప్పే ప్రయత్నం చేశాడు. అట్లీ చెప్పే కథ.. రొటీన్ గా అనిపించినా, బోర్ కొట్టినా, పాత సినిమాలు గుర్తుకు చేసినా.. కనీసం ఫ్యాన్స్ ని సంతోషపెట్టడానికి తెరకెక్కించిన సన్నివేశాలు `విజిల్` కొట్టేలా ఉండేలా చూసుకోవడంతో అట్లీ ప్రయత్నానికి పెద్దగా అడ్డంటూ ఏమీ లేకుండా పోయింది.

భారీ బిల్డప్పులు, ఓ ఫైటు, ఓ పాట… ఇలా సగటు విజయ్ సినిమాల్లోలానే రొటీన్ గానే ‘విజిల్` ప్రారంభం అవుతుంది. నయనతార తో సన్నివేశాలు తమిళ వాసన కొట్టినా.. విజయ్ ఫ్యాన్స్ కి నచ్చుతాయి. తండ్రీ తనయుల మధ్య సన్నివేశాల్లో ఎమోషన్ బాగానే వర్కవుట్ అయ్యింది. ఫైట్స్ కి మాస్ కి నచ్చేలా డిజైన్ చేయడం, ఇంట్రవెల్ బ్యాంగ్ వర్కవుట్ అవ్వడంతో ఫస్టాఫ్ పాస్ అయిపోతుంది. ద్వితీయార్థంలో స్పోర్ట్స్ డ్రామా మొదలవుతుంది. ఎంత కొత్తగా చెప్పాలని ప్రయత్నించినా.. చెక్ దే ఛాయలు పుష్కలంగా కనిపిస్తాయి. అయితే… చెక్ దేలో మైదానంలో సాగే ఆట రసవత్తరంగా ఉంటుంది. ప్రత్యర్థుల్ని మట్టికరిపించడానికి కోచ్ వేసే ఎత్తుగడలు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల… అట్లీ ఆ ఫార్ములా కాపీ కొట్టాడు. అయినా సరే… అలాంటి ఇంట్రెస్ట్ ఇక్కడ రీ క్రియేట్ చేయడంలో తడబడ్డాడు. ఓ పెళ్లయిన అమ్మాయిని టీమ్ లోకి చేర్చుకోవడం, యాసిడ్ దాడికి గురైన అమ్మాయిలో స్ఫూర్తి నింపే సన్నివేశాలు బాగా వచ్చాయి. నిజానికి ద్వితీయార్థానికి ఇవే బలాలు. పోలీస్ స్టేషన్ లో విజయ్ చేసే హంగామా ఫ్యాన్స్ కి నచ్చుతుంది. ఫుట్ బాల్ మ్యాచ్ కి ముందు పతాక సన్నివేశాలు కాస్త బోరింగ్ గా, మరీ రొటీన్ గా అనిపిస్తాయి. మ్యాచ్ అయిపోయిన తరవాత కూడా కథని సాగదీయడానికి ప్రయత్నించాడు. అలా ద్వితీయార్థం లెంగ్తీగా మారింది. కట్ చేసుకునే వెసులుబాటు ఉన్నా, దర్శకుడు పట్టించుకోలేదు. ఇది మాస్, కమర్షియల్ సినిమా కాబట్టి లాజిక్ ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలా లాజిక్కులు వేసుకుంటూ పోతే, రెండ్రోజుల్లో మ్యాచ్ ఉండగా.. కోచ్ లు మారడం ఏమిటో, ఎక్కడెక్కడి నుంచో ప్లేయర్లని అప్పటికప్పుడు దిగుమతి చేయడం ఏమిటో అర్థం కాదు.

తెరపై ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆనందం. మన దేశంలో ఫుట్ బాల్ కి, అందులోనూ వుమెన్ ఫుట్ బాట్ మ్యాచులకు ఇంత ఆదరణ ఉంటుందా? అనిపిస్తుంది. నిజంగానే ఉంటే ఎంత బాగుంటుందో కదా… అనిపిస్తుంది. మొత్తానికి ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథని, ఇంత కమర్షియల్ గా అందించడంలో మాత్రం.. అట్లీ దర్శకులకు కొత్త పాఠాలు నేర్పాడనే అనుకోవాలి.

విజయ్ కి టేలర్ మేడ్ పాత్ర ఇది. డ్యూయెల్ రోల్ చేశాడు. తండ్రిగా, తనయుడిగా కనిపిస్తాడు. అయితే రెండు పాత్రలకూ లుక్కులు మారినా, మేనరిజం, డైలాగ్ డెలివరీ ఇంచుమించుగా ఒక్కటే. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేని పాత్ర. ఇది వరకటి కంటే కాస్త యంగ్ గా కనిపించాడు. తెలుగులో విజయ్ కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. తమిళంలో విజిల్స్ పడే సన్నివేశాలు కూడా తెలుగులో కాస్త ఓవర్ గా అనిపిస్తాయి. ఆయా సన్నివేశాలు తెలుగులో ఎంత వరకూ వర్కవుట్ అవుతాయన్న దానిపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. నయనతారది రెగ్యులర్ హీరోయిన్ పాత్రే. ఫుట్ బాల్ టీమ్ తో పాటు తను ట్రావెల్ చేయకపోతే, ద్వితీయార్థంలో అసలు ఆ పాత్రకు పనే ఉండేది కాదు. జాకీష్రాఫ్ మరోసారి స్టైలీష్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు.

టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఉందీ సినిమా. రెహమాన్ పాటలు అంతగా ఆకట్టుకోవుగానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసింది. కాకపోతే కొన్ని చోట్ల.. మరీ ఎక్కువ బిల్డప్పులు ఇచ్చాడు. ఓ పాటలో రెహమాన్, అట్లీ కనిపిస్తారు కూడా. కెమెరా వర్క్ చక్కగా ఉంది. ఈ సినిమాని విజువల్ ఫీస్ట్ గా మార్చింది. అట్లీకి మాస్ పల్స్ బాగా తెలుసు. విజయ్ తో ఇది వరకు సినిమా తీశాడు కాబట్టి, విజయ్ ఫ్యాన్స్ కి ఏం కావాలో బాగా గ్రహించాడు. వాటికి ఏమాత్రం లోటు లేని సినిమా తీశాడు. తమిళ వాసనల్ని కాస్త తట్టుకుంటూ, విజయ్ లో మన హీరోని ఊహించుకుంటే సినిమా చూస్తే.. తప్పకుండా విజిల్ కొట్టాలనే అనిపిస్తుంది

This reviewer has watched Telugu dubbed Version.

తెలుగు360 రేటింగ్‌: 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close