హైదరాబాద్‌లో ఇప్పుడు ఒక్కటే టూరిస్ట్ స్పాట్!

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పుడు దానిముందు వెలవెలపోతున్నాయి. నగరంలోని అన్ని దారులూ అక్కడకే వెళుతున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి వస్తున్న భక్తులు అక్కడ బారులు తీరుతున్నారు. అదే ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి మంటపం. ఇప్పుడది ఒక తాత్కాలిక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. మొదటిరోజునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారిపోయాయి.

59 అడుగుల మహా గణపతికి చవితిరోజున గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్య చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పూజలో పాల్గొన్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఉత్సవకమిటీ నిర్వాహకుడు, ఎమ్మెల్యే చింతల స్వాగతం పలికారు. అదనపు డీజీ అంజనీకుమార్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. మహా గణపతికి ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 75 అడుగుల జంధ్యం, కండువా సమర్పించారు. ఉదయం 7.30 గంటలకు వందలాదిమంది పద్మశాలీలు ఊరేగింపుగా ఒగ్గుడోలు, కోలాటం, మంగళహారతులు, బ్యాండ్ మేళాలతో గుర్రపు బగ్గీపై వాటిని తీసుకొచ్చారు. ఇక, ప్రతిసంవత్సరం మాదిరగానే భారీ గణపతికి అంబికా దర్బార్ అగర్బత్తి వారి ఆధ్వర్యంలో 30 అడుగుల అగర్బత్తిని అందజేశారు. వినాయకుడు నిమజ్జనానికి తరలేవరకు 11 రోజులపాటు ఇక్కడ అగర్బత్తి వెలుగుతూనే ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.

మరోవైపు ఖైరతాబాద్ గణపతివద్ద రిలయన్స్ వారి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఆధ్వర్యంలో వినాయక చవితినుంచి ఈ నెల 26 వరకు ఉచిత వైఫై సేవలందిస్తోంది. గురువారం ఈ సేవలను టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ లాంఛనంగా ప్రారంభించారు. మంటపంనుంచి 100 మీటర్ల రేంజ్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

కాకినాడ తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌వారు మహా గణపతికి ఆరువేల కిలోల భారీ లడ్డూను నైవైేద్యంగా పెట్టారు. నాలుగేళ్ళుగా ఈ సంస్థవారే భారీ లడ్డును నైవేద్యంగా సమర్పిస్తుండటం తెలిసిందే. క్రేన్ సాయంతో ట్రాలీనుంచి లడ్డును గణపతి చేతిలో పెట్టారు. ఈసారి 6 వేల కిలోల లడ్డు సమర్పించిన నేపథ్యంలో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సురుచి సంస్థ అధినేత మల్లిబాబు సొంతం చేసుకున్నారు. ఇక ఈ మహా గణపతి విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ను గవర్నర్ దంపతులు ఘనంగా సత్కరించారు.

నిర్మాణంలో ఉన్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘డిక్టేటర్’ సినిమాలో గణపతిపై ప్రత్యేకంగా రూపొందించిన ఓ పాట సీడీని చిత్ర యూనిట్ ఖైరతాబాద్ మహా గణపతివద్ద ఆవిష్కరించింది. హీరో బాలకృష్ణ, హీరోయిన్ అంజలి, దర్శకుడు శ్రీవాస్, రచయిత కోన వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్న మహా గణపతివద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 32 సీసీ కెమేరాలను ఏర్పాటుచేసి వాటిని ఇంటర్నెట్ సహకారంతో కంట్రోల్ రూమ్, పోలీస్ ఉన్నతాధికారుల సెల్ ఫోన్లలో పర్యవేక్షించే విధంగా అనుసంధానం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com