సుభాష్ : నాశనమవుతోంది ఒక్క కులం కాదు సామీ.. మొత్తం ఏపీ..!

వినాశకాలే విపరీత బుద్ది..! అమరావతిని నిలిపివేస్తే.. ఒక్క సామాజికవర్గం నాశనం అయిపోతుందంటూ.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అమరావతి ఒక్క సామాజికవర్గానిదంటూ.. అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆ సామాజికవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ.. బలపడనీయకూడదంటూ.. ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతిని గందరగోళంలోకి నెట్టేసింది.

ఏ మాత్రం సిగ్గుపడకుండా అమరావతిపై కులముద్ర..!

పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే… అమరావతిపై కుల ముద్ర వేస్తున్నారు. మంత్రి పొజిషన్‌లో ఉండి అలా మాట్లాడకూడదని వస్తున్న విమర్శల్ని ఆయన లెక్క చేయడం లేదు. రికార్డుల పరంగా చూసినా.. అమరావతిలో అక్కడ వైసీపీ టార్గెట్ పెట్టుకున్న సామాజికవర్గం వారు మాత్రమే కాదని.. అందరూ ఉన్నారని.. తేలింది. అయినప్పటికీ.. రాజధానిగా అది అందరికీ చెందుతుందన్న విశాలమైన భావనకు మాత్రం ప్రభుత్వం రాలేకపోయింది. అందుకే పీక పిసికి చంపడానికి సిద్ధమయింది. దాదాపుగా చంపేసింది. అమరావతి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి వచ్చింది.

సింగపూర్ ఒప్పందం రద్దుతోనే పాతాళంలోకి ఏపీ ఇమేజ్ ..!

సింగపూర్ తో స్టార్టప్ ఏరియా ఒప్పందాన్ని.. దేశ పారిశ్రామిక వర్గాలు ఓ గేమ్ చేంజర్ గా చూశాయి. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. దేశంలో ఓ కొత్త మోడల్ వ్యాపార సామ్రాజ్యం అవిష్కృతమవుతుందని.. సింగపూర్ తరహా అభివృద్ధి సాధ్యమవుతుందని.. భావించారు. కానీ అలాంటి ప్రాజెక్టుకే.. ఏపీ కొత్త ప్రభుత్వం మంగళం పాడేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పతనం అయిందని.. పారిశ్రామికవేత్తలు.. జాలి చూపిస్తున్నారు. ఇక .. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులతో ఎవరు వస్తారని.. అక్కడి యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని.. విచారం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వైదొలగడం.. ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత చెడు వార్త అని.. . జగన్మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేస్తున్నారని తేల్చేశారు. ఈ నిర్ణయం వల్ల.. ఇక పెట్టుబడిదారులు ఎవరైనా ఏపీ వైపు రావడానికి ఇష్టపడరంటున్నారు.

మొత్తం ఏపీనే నాశనం అవుతోంది..! ఒక్క కులం కాదు..!

పలువురు పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు కూడా… ఏపీ సర్కార్ తీరుపై.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏం చేస్తోందని… ఇలాంటి ప్రాజెక్టులు నిలిపివేయడం వల్ల.. ఎంత నష్టం జరుగుతుందో.. ప్రభుత్వం ఎందుకు అంచనా వేయలేకపోతోందని.. ప్రశ్నించారు. ఈ నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని దారుణంగా మార్చేస్తుందని… అభిప్రాయపడ్డారు. నిజానికి ప్రభుత్వం మారినప్పటికీ… అమరావతిలో సింగపూర్ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి సింగపూర్ ఆసక్తిగానే ఉంది. కానీ ఏపీ సర్కారే.. ఓ సామాజికవర్గం పేరు పెట్టి… అమరావతిని తెంచేసింది. ఇక మిగిలింది… ఏపీ వినాశనమే. దీని వల్ల ఒక్క సామాజికవర్గమే మట్టికొట్టుకుపోదు.. అందరూ.. ప్రజలందరూ.. కొట్టుకుపోతారు. ఈ విషయం 151 సీట్ల మత్తులో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాకా చేరుతుందో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com