ఈనెల 31న కింగ్ డమ్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. టీజర్‌తో ఆసక్తి పెంచిన చిత్రబృందం… ట్రైలర్‌తో అంచనాల్ని మరింత రెట్టింపు చేసింది. ట్రైలర్ లో ‘కింగ్ డమ్’ సెటప్ అంతా అర్థమైపోయింది. ప్రేక్షకులు ఎలాంటి సినిమా చూడబోతున్నారు? ఆ వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉండబోతోంది? కథలో కాన్ఫ్లిక్ట్ ఏమిటి? కింగ్ డమ్’ నుంచి ఎవరేం ఆశించొచ్చు అనేదానికి ట్రైలర్ ఓ సమాధానంగా నిలిచింది.
ట్రైలర్ కట్ చేయడంలో రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి.. కథేంటో చెప్పేసి, ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయడం. రెండోది… కథని దాచి ప్రేక్షకుల్ని థియేటర్లో సర్ప్రైజ్ చేయడం. ‘కింగ్ డమ్’ మొదటి ఫార్ములా ఎంచుకొంది. ఓరకంగా ఇది సేఫ్ జోన్. ఆడియన్ ని సినిమాకు ముందే ప్రిపేర్ చేయడం మంచిది. ఏదోదే ఊహించుకొని థియేటర్‌కి వస్తే అది మరింత ప్రమాదం. ‘మా కథ ఇది.. మా హీరో ఇలా ఉంటాడు’ అని ముందే చెప్పేయడం వల్ల ఆ అంచనాల్ని తగ్గించొచ్చు. కాకపోతే.. తెలిసిన కథని స్క్రీన్ పై చూడడం మరో రకంగా ఇబ్బంది. ట్రైలర్ చూసి కథేమిటో ఫిక్సయిపోయిన ప్రేక్షకుడు.. థియేటర్లో అంతకు మించిన ఫీస్ట్ ఏదో కోరుకొంటాడు. కథ తెలిసినప్పుడు సీన్లు కొత్తగా రాసుకోవాలి. మధ్యలో ఊహించని థ్రిల్స్ ఇవ్వాలి. ట్విస్టులు మామూలుగా ఉండకూడదు. ఇవన్నీ కుదరాలి. అవన్నీ లేకుంటే ప్రేక్షకులకు ఆనదు. ఈ విషయంలో చిత్రబృందం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొందన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
గురువారం ఈ సినిమా విడుదల అవుతోంది. బుధవారమే ప్రీమియర్లు పడిపోతున్నాయి. ప్రీమియర్ షోల వల్ల అడ్వాంటేజీ ఉంది. దాంతో పాటు తలనొప్పులూ ఉన్నాయి. సినిమా బాగుంటే రిలీజ్ డే నాటికి బజ్ మరింత పెరుగుతుంది. ఓపెనింగ్స్ కి అది చాలా కీలకం. ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం వసూళ్లపై భారీగా ఉంటుంది. సినిమా చూడాలని అని డిసైడ్ అయినవాళ్లు కూడా ఓటీటీ వైపు చూస్తారు. ‘గుంటూరు కారం’ తరవాత ప్రీమియర్ షోలు వేయాలంటే నాగవంశీ కాస్త భయపడుతున్నాడు. కానీ ‘కింగ్ డమ్’కి మళ్లీ ఆయన ధైర్యం చేస్తున్నారు. బహుశా.. కంటెంట్ పై బలంగా నమ్మకం కుదిరి ఉంటుంది. పైగా ఈ సినిమా గురించి నాగవంశీ ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఓ హై వస్తోంది. సో… ఆ నమ్మకంతోనే ప్రీమియర్లు ప్లాన్ చేసి ఉండొచ్చు. గత వారమే ‘వీరమల్లు’ వచ్చింది. వార్2, కూలీ వరుసలో ఉన్నాయి. వీటి మధ్యలో సినిమాని విడుదల చేయడం కాస్త ఇబ్బందే. టైమ్ తక్కువగా వుంది. పైగా వరుసగా పెద్ద సినిమాల్ని భరించే ఓపిక సాధారణ ప్రేక్షకుడికి ఉండకపోవొచ్చు. ఇవన్నీ ‘కింగ్ డమ్’ ముందున్న సవాళ్లే. వాటిని ఈ సినిమా ఎలా అధిగమిస్తుందో చూడాలి.