Kingdom Movie review
తెలుగు360 రేటింగ్: 2.75/5
‘కింగ్ డమ్’పై చాలామంది కెరియర్లు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండది. తనలో ఉన్న టాలెంట్ ని ఎవ్వరూ ప్రశ్నించలేరు. తన కష్టాన్నీ తక్కువ చేయలేరు. కానీ కావాల్సిందల్లా విజయమే. అది ‘కింగ్ డమ్’తో దొరుకుతుందని గట్టిగా నమ్మాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై కూడా చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. ‘జెర్సీ’ తరవాత తనకంటూ అభిమానుల్ని ఏర్పడ్డారు. నిర్మాత నాగవంశీ కూడా ‘కింగ్ డమ్’ గురించి ఓ రేంజ్లో హైప్ ఇచ్చుకొంటూ వెళ్లారు. టీజర్, ట్రైలర్ ఎక్ట్రాక్ట్ చేశాయి. ‘ఇదేం రెగ్యులర్ సినిమా కాదు’ అనే ఫీలింగ్ కలిగించాయి. మరింతకీ ‘కింగ్ డమ్’ ఎలా వుంది? అభిమానుల అంచనాలు నెరవేరుతాయా?
శివ (సత్యదేవ్), సూరి (విజయ్‌దేవరకొండ) అన్నాదమ్ములు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే అనుకోని కారణాల వల్ల శివ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. పెరిగి పెద్దైన సూరికి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. పద్దెనిమిదేళ్ల నుంచి పారిపోయిన తన అన్నకోసం వెదుకుతూనే ఉంటాడు. ఒక్కసారైనా తన అన్నయ్యని కలవాలని తపన పడుతూనే ఉంటాడు. అండర్ కవర్ ఏజెంట్ గా మారి, పై అధికారులు చెప్పిన పని చేసి పెడితే… అన్నయ్యని కలిసే అవకాశం వస్తుంది. అందుకోసం శ్రీలంక వెళ్లాలి. అక్కడ ఓ గూడానికి పెద్ద దిక్కుగా ఉన్న శివని, తన దారిలోకి తెచ్చుకోవాలి. దేశానికి వస్తున్న ఓ ఆపదని తప్పించాలి. ఇవన్నీ.. సూరి ముందున్న సవాళ్లు. ఓ సాధారణ కానిస్టేబుల్ కి ఈ మిషన్ అప్పగించడానికి కారణం ఏమిటి? అసలు శివ ఇల్లు వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? శ్రీలంకలో సూరికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? ఓ గూడెంతో.. ఓ జాతితో సూరికి ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తక్కిన విషయాలు.
ఈరోజుల్లో సాధారణమైన కథలు ప్రేక్షకులకు ఎక్కడం లేదు. వాళ్లకేదో సెటప్ కావాలి. వరల్డ్ బిల్డింగ్ లాంటి అదనపు హంగులు ఉండాలి. స్క్రీన్‌ప్లేలో కూడా ఏదో గమ్మత్తు కనిపించాలి. ట్విస్టులు, ఎలివేషన్లూ షరా మామూలే. ఇన్నుంటే తప్ప ఏ కథా ఆనడం లేదు. ఇవన్నీ కాకపోయినా, ఇందులో కొన్ని అంశాలు ఉన్న స్క్రిప్టు ‘కింగ్ డమ్’. ఓ జాతికి జరిగిన అన్యాయం, రాజు కోసం ఎదురు చూస్తున్న సైన్యం అంటూ కథని మొదలెట్టిన విధానం తప్పకుండా ఆకట్టుకొంటుంది. రెండో నిమిషం నుంచే కథని ఫాలో అయిపోవాల్సిన అవసరాన్ని దర్శకుడు కలిగిస్తాడు. విజయ్ ఎంట్రీ సీన్ కూడా చాలా సహజంగా ఉంటుంది. ఓ సాధారణమైన కానిస్టేబుల్ ని ఇంత పెద్ద మిషన్‌లోకి ఎందుకు లాక్కొచ్చారు? అనే లాజిక్ వేసుకొనే అవకాశం లేకుండా ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు గౌతమ్. ఓ కమర్షియల్ సినిమాకు ఇంతకంటే పెద్ద సెటప్ ఉండదు. అవసరం కూడా లేదు. హీరో ముందు లక్ష్యం ఉంది. ఆ ప్రయాణం ప్రమాదకరం అని తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడి నుంచి అసలైన ఆట ఆడొచ్చు.
గౌతమ్ రెగ్యులర్ పేట్రన్ని ఈ సినిమా కోసం దూరం పెట్టాడు. హీరో – హీరోయిన్ల ట్రాక్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఓ పాట తరవాత ఫైటు.. అనే లెక్కలు వేసుకోలేదు. ఓరకంగా మోడ్రన్ థాట్స్ తో స్క్రిప్టు రాసుకొన్నాడు. అది మంచిదే. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్లకు రిలీఫ్ ఇస్తుంది. అన్నాదమ్ములు తొలిసారి కలుసుకొన్న సీన్ సాధారంగా ఏ దర్శకుడైనా హై ఎమోషన్ తో రాసుకొంటాడు. ప్రేక్షకులు కూడా అది ఆశిస్తారు. కానీ ఒక్క డైలాగ్‌తో సూరి తన తమ్ముడ సంగతి సత్యకి అర్థమైపోతుంది. అక్కడ రెగ్యులర్ సినిమాల్లో డైలాగులు, మూమెంట్స్ ఏం ఉండవు. ఇన్నేళ్ల తరవాత తమ్ముడు దొరికాడన్న ఆనందాన్ని కేవలం సత్యదేవ్ కళ్లతో పలికించగలిగాడు. ఇలాంటి మూమెంట్స్ ఈ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తాయి. కొత్త తరహా సినిమా చూద్దాం అనుకొనేవాళ్లకు అవి నచ్చుతాయి. కానీ కొంతమందికి మాత్రం `మరీ ఇంత ఫ్లాట్ గా తీశాడేంటి` అనిపిస్తుంది.
సూరి శ్రీలంక వెళ్లిన తరవాత అతనికి విషమ పరిస్థితులు ఎదురౌతూనే ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడతాడు? సూరి దొరికిపోతే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలతో ప్రేక్షకులకు ఊపిరిసలపనివ్వకూడదు. అందుకు తగిన సెటప్పే చేసుకొన్నాడు గౌతమ్. ఉదాహరణకు నేవీ దగ్గర ఉన్న బంగారం తీసుకొస్తానని గ్యాంగ్ కి మాట ఇస్తాడు సూరి. అక్కడ గన్నులతో వేసిన ఓటింగు, సూరి చూపించే ఇంటెన్సిటీ… చాలా కమర్షియల్ టచ్‌తో సాగుతాయి. బంగారం తీసుకొచ్చే విధానం కూడా ఎగ్జటింగ్ గా ఉంటుంది. అయితే ఇలాంటి హై మూమెంట్స్ రాను రాను మరిన్ని వస్తాయిని ఆశించిన ప్రేక్షకుడికి భంగపాటు ఎదురవుతుంది. గౌతమ్ ఈ సినిమాలో ఎక్కడా ‘హై మూమెంట్స్’ని తీసుకురావాలన్న ప్రయత్నం చేయలేదు. కథలో భాగంగా వస్తే.. రాసుకొంటూ వెళ్లాడు. పని గట్టుకొని వాటి కోసం ప్రయత్నించలేదు. కాకపోతే కొన్నిసార్లు.. ముఖ్యంగా ఇలాంటి కథలకు ప్రేక్షకులు ‘హై ఎనర్జీ’ ఆశిస్తారు. వాటిని ఇవ్వాల్సినప్పుడు ఇచ్చేయాల్సిన బాధ్యత దర్శకుడికి ఉంది. కేజీఎఫ్, ట్రిపుల్ ఆర్, పుష్ప చూసిన కళ్లకు ఇంటెన్సిటీ సరిపోవడం లేదు. కాస్త హై.. కావాలి. అది చాలా సందర్భాల్లో మిస్ అయ్యింది.
ఈ సినిమాలో కీలకమైన మరో ఎపిసోడ్ ఉంది. అది.. సూరి తన సీక్రెట్ కోడ్ రివీల్ చేయడం. ‘ఇది నీ అత్యవసర పరిస్థితుల్లోనే వాడు’ అంటూ పై అధికారి సూరికి ఓ కోడ్ ఇస్తాడు. అది సూరి ఎప్పుడు వాడతాడా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో క్రియేట్ చేశాడు. హీరో ఆపదలో ఉన్నప్పుడు ‘ఇప్పుడు ఈ ఒక్క లైఫ్ లైన్ వాడేస్తాడా?’ అనే క్యూరియాసిటీ రేకెత్తించాలి. దాన్ని దాటుకొంటూ సన్నివేశాన్ని డిజైన్ చేయాలి. మోడ్రన్ థాట్స్ తో సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లేనే ఎవరైనా ఆశిస్తారు. కానీ.. సూరి ఈ లైఫ్ లైన్ వాడిన సందర్భం అంత ఎగ్జయిటింగ్ మూమెంట్ గా అనిపించదు.
”పది తలల రావణాసురిడో పోరుకోసం కదిలాడు.. ఇక ఎవరు ఆపగలరు? దహనం చేసేస్తాడు” అంటూ ఇంటెన్స్ తో కూడిన పాట బ్యాక్ గ్రైండ్ లో వినిపిస్తుంటుంది. పది తలల రావణాసురుడు ఎవరింతకీ? అంటే తను ఓ రెగ్యలర్ విలన్. తండ్రి చనిపోతే, అధికారం తన చేతుల్లోకి వస్తుందని ఆశించే ఓ మామూలు ప్రతినాయకుడు. శ్రీలంక వెళ్లిన సూరికి… రావణుడు లాంటి విలన్ తగలాలి కదా? అలా తగిలితేనే కదా రావణుడ్ని చంపి రాజు అయ్యేది. ప్రతినాయకుడికి ఇచ్చిన బిల్డప్ ఎక్కువగానే ఉన్నా, చూస్తేనే భయం పుట్టేంత విలనీ మాత్రం లేదు. క్లైమాక్స్ కూడా… ఏదో చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. పార్ట్ 2 తీస్తున్నప్పుడు అందుకోసం కొన్ని సన్నివేశాలు, ఎపిసోడ్లు, సంఘర్షణలూ అట్టిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాదనలేం. కాకపోతే… అందుకోసం పార్ట్ 1లో ఎమోషన్ తగ్గించాల్సిన అవసరం లేదు. వాయిస్ ఓవర్లతో పార్ట్ 2లో ఏం జరగబోతోంది? అనేదానిపై హింట్ ఇచ్చాడు దర్శకుడు. అదంతా.. పార్ట్ 1లోకే లొక్కొస్తే కింగ్ డమ్ ప్రయాణం మరింత రసవత్తరంగా సాగేది.
విజయ్ దేవరకొండలో కసి కనిపించింది. సూరి పాత్ర కోసం ఏమైనా చేస్తానన్న తెగువ కనిపించింది. రెగ్యులర్ హీరోయిజాన్ని విజయ్ నమ్మలేదు. దర్శకుడు ఏం చెబితే అది చేశాడు. చాలా సందర్భాల్లో విజయ్‌లోని నటుడు బయటకు వచ్చేస్తాడు. తనని తాను ఎలివేట్ చేసుకొన్నాడు. చాలా సన్నివేశాలు విజయ్ చూపించిన ఇంటెన్సిటీ వల్ల నిలబడగలిగాయి. సత్యదేవ్‌కి మరో మంచి పాత్ర పడింది. తను ఎంత మంచి నటుడో ఈ సినిమాతో మరోసారి అర్థమైంది. భాగ్యశ్రీది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. తనకున్న స్క్రీన్ స్పేస్ తక్కువ. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఈ పాత్ర కనిపిస్తుంది. తనపై చిత్రీకరించిన ఓ పాట కూడా ఎడిట్ లో పోయింది. మురుగన్ పాత్రలో కనిపించిన వెంకటేష్ లుక్స్ బాగున్నాయి. ఓ సీన్లో అరాచకం సృష్టించాడు. తన పాత్ర ఇంకాస్త బాగా డిజైన్ చేయాల్సింది.
టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్న సినిమా ఇది. విజువల్స్ బాగున్నాయి. చాలా వరకూ నేచురల్ లొకేషన్స్ లో తీశారు ఈ సినిమాని. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. అనిరుథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత బలం ఇచ్చింది. కొన్ని సన్నివేశాల్లో దమ్ము లేకపోయినా అనిరుథ్ ఏదోలా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సితార నాగవంశీ ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. అదంతా తెరపై కనిపించింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అన్నదమ్ముల కథని రెగ్యులర్ పేట్రన్ లో కాకుండా ఓ కొత్త సెటప్ లో రాసుకొన్నాడు. కొత్తగానూ తీద్దామనుకొన్నాడు. ఆ ప్రయత్నం కొంత వరకూ మెప్పించింది. మరీ రెగ్యులర్ సినిమాలు చూసేవాళ్లకు ఇది నచ్చకపోవొచ్చు. కానీ న్యూ ఏజ్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు, సినిమా అంటే ఎలివేషన్లు హీరోయిజం మాత్రమే కాదు అని నమ్మేవాళ్లకు ‘కింగ్ డమ్’ సంతృప్తి ఇస్తుంది.
తెలుగు360 రేటింగ్: 2.75/5
– అన్వర్