ఈ దీపావళికి వస్తున్న సినిమాల్లో `కె-ర్యాంప్` ఒకటి. కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. నాని దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. 18న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఓ టీజర్, ట్రైలర్ వదిలారు. ఇప్పుడు మరో రిలీజ్ ట్రైలర్ సిద్ధం చేశారు. ‘ఫ్యామిలీ ప్యాక్ లాంటి సినిమా’ అని చిత్రబృందం చెబుతున్నా, టీజర్.. ట్రైలర్ చూస్తే ఇది అచ్చంగా కుర్రాళ్ల సినిమానే అనిపించాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ కూడా అలానే ఉంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని మలిచే ప్రయత్నం చేశారు. కిరణ్ అబ్బవరం ఎనర్జీ, ఈ జనరేషన్‌కు నచ్చేలా డైలాగులు, మాస్ లుక్స్.. ఇవన్నీ తప్పకుండా ఆకట్టుకొంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ని సైతం టిపికల్ గా రాసుకొన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇప్పటి వరకూ కిరణ్ క్యారెక్టర్ మాత్రమే కొత్తగా ఉంటుందని భావించారంతా. కానీ ఈసారి హీరోయిన్ క్యారెక్టర్ కూడా సర్ప్రైజ్ చేసింది. నరేష్ గెటప్, తన డాన్సులు కూడా ఫన్నీగా కుదిరాయి. ట్రైలర్ మొదలు నుంచి చివరి వరకూ ఒకటే జోష్‌లో సాగింది. అక్కడక్కడ కొన్ని బూతులు కూడా వినిపిస్తాయి. లిప్ లాక్‌లు కనిపిస్తాయి. ఫ్యామిలీ సినిమా అని చెబుతున్నా – అలాంటి యాంగిల్ లో ఒక్క షాట్ కూడా చూపించకపోవడం విశేషం.
కొచ్చిలో తీసిన ఎపిసోడ్, ఇంట్రవెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. రన్ టైమ్ కూడా పర్ఫెక్ట్ గానే కట్ చేశారు. దాదాపు 2 గంటల 15 నిమిషాల సినిమా ఇది. గతేడాది ‘క’ సినిమాని దీపావళికి రిలీజ్ చేశాడు కిరణ్ అబ్బవరం. అది మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ‘కె.ర్యాంప్’తో తన సెంటిమెంట్ పునరావృతం అవుతుందని భావిస్తున్నాడు. ఈ దీపావళి సీజన్లో వస్తున్న సినిమాలకు సంబంధించి కంటెంట్ స్టఫ్ దాదాపుగా వచ్చేశాయి. అన్నింటితో పోలిస్తే ‘కె.ర్యాంప్’ కాస్త ముందు వరుసలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది జోష్ థియేటర్లలోనూ ఉంటే హిట్టు గ్యారెంటీ.