10వ తరగతి పిల్లల SSC పరీక్ష ఫీజులు తమ తమ నియోజకవర్గాల్లో తామే కడతామని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రకటించారు. బండి కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల 12 వేల మంది 10వ తరగతి విద్యార్థుల SSC పరీక్ష ఫీజులు సుమారు రూ.25 లక్షలు చెల్లిస్తానని ఎవరూ కట్టాల్సిన పని లేదన్నారు. నవంబర్ 10న ఈ ప్రకటన చేసిన బండి సంజయ్ అధికారులతో పాటు తన టీమ్‌ను ఈ పనిని చక్కబెట్టేందుకు పురమాయించారు.
కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ బాటలోనే !
అనూహ్యంగా కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి పిల్లల ఫీజులు తానే చెల్లిస్తానని ప్రకటించారు. పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులు చెల్లించనున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు కిషన్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులందరి పరీక్ష ఫీజులను తన వ్యక్తిగత వేతనం నుంచి చెల్లిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు లేఖ రాశారు. అంత్యోదయ స్ఫూర్తితో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కిషన్ రెడ్డి వెల్లడించారు.అందులో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు?, వారి కోసం చెల్లించాల్సిన పరీక్ష ఫీజు మొత్తం ఎంత?, ఆ మొత్తాన్ని ఏ బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేయాలి? అనే వివరాలు తెలియజేయాలని కోరారు.
బండి, కిషన్ మధ్య కనిపించని పోటీ
ఓ వైపు బండి సంజయ్ చేస్తున్న పనిని.. కిషన్ రెడ్డి కూడా చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి మధ్య తెలియని పోటీ జరుగుతోందని అందుకే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. బండి సంజయ్ కొద్ది రోజుల కిందట .. వివిధ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులను సమీకరించి.. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే ఆడపిల్లలందరికీ సైకిళ్లు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్డుడు పరీక్ష ఫీజులు కడుతున్నారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన చేయని కిషన్ రెడ్డి మాత్రం.. ఫీజులు కట్టేందుకు సిద్ధమయ్యారు.
మిగతా బీజేపీ ఎంపీలపై ఒత్తిడి !
మిగతా బీజేపీ ఎంపీలు కూడా అదే దారిన పడతారో లేదో కానీ.. బండి సంజయ్, కిషన్ రెడ్డి మధ్య మాత్రం పోటీ వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు. కిషన్ రెడ్డి ఒకప్పుడు తెలంగాణ బీజేపీకి ఫేస్ గా ఉండేవారు. కానీ ఇటీవలి కాలంలో బండి సంజయ్ ఆయనను మించిపోయారు. కట్టర్ హిందూత్వవాదిగా ఆయన ఇమేజ్ పెంచుకుంటున్నారు. ఇది కిషన్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. సీనియర్ గా ఆయనకు మోదీ, షా వద్ద పలుకుబడి ఉన్నప్పటికీ.. బండి సంజయ్ దూకుడు మాత్రం .. కిషన్ రెడ్డిని వెనకుబడేలా చేస్తోంది. అందుకే బండితో పోటీ పడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు.


