కేసీఆర్ ను అరెస్టు చేయడం లేదు కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. కానీ కిషన్ రెడ్డి అసలు చర్యలు తీసుకోవాల్సింది రేవంత్ అని.. ఆ పని చేయలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మరియు అక్రమాలపై చర్యలు తీసుకుంటామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్పై చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ మరియు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విచారణల తీరును కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని, అందుకే విచారణ సంస్థలను సరిగ్గా పని చేయనివ్వడం లేదని విమర్శించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, దర్యాప్తు సంస్థలు ఇచ్చిన ఆధారాలతో కేసీఆర్ ,ఆయన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రె, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలని కిషన్ రెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని, ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం బీజేపీపై బురద చల్లడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే చర్యలు తీసుకోవడం చేతకాకపోతే కుర్చీ దిగిపోవాలి అంటూ రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. రెండు పార్టీలు.. బీఆర్ఎస్ తో మీరంటే మీరు కుమ్మక్కు అని ఆరోపించుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఏమీ స్పందించలేకపోతోంది.
