భాగ్యనగర మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ ఓ కీలకమైన షరతు పెట్టింది. ఆ షరతు వల్ల పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అంశంపై ఓ లేఖ రాశారు. మెట్రో మొదటి దశను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం జరపాల్సిన ఆర్థిక లావాదేవీల పరిష్కారం అయిన తర్వాత మెట్రో రెండో దశ ముందుకు వెళ్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేంద్రం ఐదుగురు సభ్యులతోకమిటీ వేస్తోందని అందులో తెలంగాణ ప్రభుత్వం తరపున ఇద్దరు అధికారులు ఉండాలని.. వారి పేర్లను పంపాలని కిషన్ రెడ్డి లేఖలో కారు. కేంద్రం కోరిన విధంగా ఇద్దరు అధికారుల పేర్లను కమిటీకి పంపడంతో పాటు, ఎల్ అండ్ టీ సంస్థతో చర్చలు వేగవంతం చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం, మొదటి దశకు సంబంధించిన ఆర్థిక బాధ్యతల నుంచి విముక్తి పొందితే తప్ప, రెండో దశకు నిధులు విడుదల చేయడం లేదా సాంకేతిక అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదు.
రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని ఒక కొలిక్కి తెచ్చి, ఆ నెట్వర్క్ను అధికారికంగా స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీల్ క్లోజ్ కాకపోతే, రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోదు. మెట్రో మొదటి దశ లావాదేవీల పరిష్కారమే రెండో దశకు పునాది అని కిషన్ రెడ్డి స్పష్టం చేయడంతో, ఇప్పుడు బంతి రాష్ట్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. వేల కోట్ల రూపాయల నిధులతో ముడిపడి ఉన్న ఈ టేకోవర్ ప్రక్రియను ప్రభుత్వం ఎంత వేగంగా పూర్తి చేస్తుందనే దానిపైనే మెట్రో ఫేజ్-2 భవిష్యత్తు ఆధారపడి ఉంది.
