#GOD OF WAR… ఈ మధ్య గట్టిగా వినిపిస్తున్న పేరు. త్రివిక్రమ్ ఈ సబ్జెక్ట్ తో ఓ కథ రాసుకొన్నారు. ముందుగా అల్లు అర్జున్ కి వినిపించారు. ఆ తరవాత ఎన్టీఆర్ దగ్గరకు ఈ కథ వెళ్లింది. ఇప్పుడు మళ్లీ బన్నీతోనే త్రివిక్రమ్ ప్రొసీడ్ అవుతారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ కథని మా హీరోతోనే చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఓ రకమైన గందరగోళం నడుస్తోంది. అలా గాడ్ ఆఫ్ వార్ టైటిల్ బాగా ఫేమస్ అయ్యింది.
అయితే ఇలాంటి సబ్జెక్ట్ ఇది వరకే తయారు చేసి పెట్టుకొన్నార్ట.. దర్శకుడు కిషోర్ తిరుమల. నేను శైలజ, చిత్రలహరి, ఆడాళ్లూ మీకు జోహార్లు లాంటి సినిమాలతో అలరించిన దర్శకుడు ఈయన. ఇప్పుడు రవితేజతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా తీశారు. ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతోంది. రెండేళ్ల క్రితం కుమారస్వామి పాత్ర చుట్టూ. గాడ్ ఆఫ్ వార్ లాంటి ఓ కథ రాసుకొన్నారు. అది నానికి కూడా వినిపించారు. నానికి కథ బాగా నచ్చింది. అయితే అప్పట్లో తన కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాని పట్టాలెక్కించడం కుదర్లేదు. అయితే ఎప్పటికైనా ఈ కథతో సినిమా చేస్తానంటున్నారు కిషోర్ తిరుమల. కాకపోతే.. మంచి బడ్జెట్ కావాలి. ఓ పెద్ద హీరో దొరకాలి. ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బాగా ఆడాలి. అప్పుడే కిషోర్ తిరుమలపై నమ్మకం కలుగుతుంది. ఈ విషయం కిషోర్‌కు కూడా బాగా తెలుసు. ”ఇలాంటి సబ్జెక్ట్ తో నేను ఇప్పటి వరకూ కథ రాసుకోలేదు. నేను ఈ కథని తీయగలనా, లేదా? అనే అనుమానాలు నిర్మాతలకు, హీరోలకూ ఉండడం సహజం. అందుకే ఆ కథ పట్టాలెక్కలేదు. కానీ భవిష్యత్తులో ఎప్పటికైనా ఈ సినిమా తీస్తా” అని చెప్పుకొచ్చారు కిషోర్ తిరుమల. రెండేళ్ల క్రితమే నాని ఈ కథని పట్టాలెక్కిస్తే, త్రివిక్రమ్ తన ప్లానింగ్ మార్చుకొనేవారేమో.
