కాంగ్రెస్ పార్టీకి ఓ పెద్ద సమస్యను సృష్టించిన కోదండరాం.. తనంతట తానుగానే పరిష్కరించి.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రిలీఫ్ కల్పించారు. జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడటంతో.. ఆయనకు ఆ నియోజకవర్గం కేటాయించాలని.. కాంగ్రెస్ దాదాపుగా నిర్ణయించుకుంది. అక్కడి నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీకి సిద్ధమయ్యారు. టీజేఏస్ కు ఇవ్వాలని నిర్ణయించడంతో ఆయన సీటు గందరగోళంలో పడింది. కోదండరాం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడం… పొన్నాల లక్ష్మయ్య బీసీ వర్గం కావడంతో… సామాజిక కోణంలో చర్చలు ప్రారంభమయ్యాయి. బీసీలకు అన్యాయం చేస్తున్నారనే దిశగా.. విశ్లేషణలు ప్రారంభం కావడంతో.. కోదండరాం వెనక్కి తగ్గారు. జనగామ పోటీ విషయంలో తాను ఇంకా తేల్చుకోలేదని ప్రకటించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ.. తను జనగామ నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్లు… పొన్నాల చెబుతున్నారు. హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లి తన ప్రయత్నాలు ప్రారంభించారు. పనిలో పనిగా బీసీ సెంటిమెంట్ ను ప్రధానంగా ప్రయోగిస్తున్నారు. తనకు టిక్కెట్ ఖాయమని… అసెంబ్లీ స్థానం కూడా మారబోనని.. ఆయన ఢిల్లీలో ధీమాగా మీడియాతో చెప్పుకొచ్చారు. పొన్నాల లక్ష్మయ్య…పోటీ విషయంలో వెనక్కి తగ్గకపోవడం.. బీసీ సెంటిమెంట్ ను బయటకు తీయడంతో తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మనసు మార్చుకున్నారు. జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య పోటీ చేయడానికి సహకరించాలని నిర్మయించుకున్నారు. పొన్నాల నిర్ణయాన్ని గౌరవిస్తాననారు.
కూటమిలో మిగిలిన సీట్ల సర్దుబాట్ల విషయంలో… ఇంకా క్లారిటీ రాకపోవడంతో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వచ్చి.. టీజేఏసీ అఫీసులో మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. వారికి కేటాయించాల్సిన స్థానాలపై చర్చలు జరిపారు. సీపీఐ మూడు స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అయిపోయింది. ఇంకో స్థానం కోసం వత్తిడి చేస్తోంది. వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్లుగా ఆ పార్టీ ఉంది. టీజేఎస్ కు ఆరు స్థానాల విషయంలో క్లారిటీ వచ్చింది. మరో మిర్యాలగూడ కోసం… టీజేఏస్ పట్టుబడుతోంది. ఈ వ్యవహారాలు తెగిన తర్వాతే కాంగ్రెస్ రెండో జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది.