కర్ణాటక రాజధానిలో యలహంక సమీపంలోని కోగిలు లేఅవుట్ కూల్చివేతలు ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా వెలసిన ఆక్రమణలను తొలగించాలని ఒకవైపు కోర్టులు, పౌర సమాజం ఒత్తిడి తెస్తుంటే.. మరోవైపు అక్కడ నివసిస్తున్న భారీ ముస్లిం మైనారిటీ వర్గాల ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సంకట స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుకుంది.
కోగిలు లేఔట్లో వివాదాస్పదమైన కూల్చివేతలు
కోగిలు లేఅవుట్లో సుమారు 20-30 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన వందలాది ఇళ్లను తొలగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే, ఆక్రమణదారులకు ప్రత్యామ్నాయ వసతి లేదా పునరావాసం కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం కొత్త వివాదానికి తెరలేపింది. అక్రమంగా భూమిని ఆక్రమించిన వారికి ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టించి ఇవ్వడం ఏంటని అన్ని వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఆక్రమణదారుల్లో అధిక శాతం ముస్లింలు ఉన్నందుకే ప్రజాధనం ధారబోస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ముస్లిం ఓటు బ్యాంక్ ఒత్తిడి
కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయకంగా అండగా ఉండే ముస్లిం ఓటు బ్యాంకు ఇక్కడ కీలకంగా మారింది. ఒకవేళ కఠినంగా వ్యవహరించి ఇళ్లను కూల్చివేస్తే ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, అది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భయపడుతోంది. కొంత మొత్తం కూల్చివేతలతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అసహనం వ్యక్తం చేసింది. దీంతో పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగుల కోసం కట్టిన ఇళ్లు ఇవ్వడానికి సిద్ధపడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఎటూ తోచని సిద్ధరామయ్య ప్రభుత్వం
ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య ప్రభుత్వం అటు చట్టపరమైన చిక్కులు, ఇటు సామాజిక విమర్శల మధ్య ఇరుక్కుపోయింది. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన బాధ్యత ఉన్నా, సొంత వర్గాల ప్రయోజనాల కోసం నిబంధనలను పక్కన పెడుతున్నారనే ముద్ర పడుతోంది. కేవలం ఒక వర్గానికి మేలు చేసేలా పునరావాస ప్యాకేజీలు ప్రకటిస్తే, భవిష్యత్తులో నగరంలోని మిగిలిన ఆక్రమణల తొలగింపు ప్రభుత్వానికి అసాధ్యంగా మారుతుంది. కోగిలు లేఅవుట్ అంశం కేవలం ఆక్రమణల తొలగింపు సమస్య మాత్రమే కాదు, అది కర్ణాటకలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతగా మారుతోంది. అనాలోచిత నిర్ణయాలతో సమస్యను సిద్ధరామయ్య మరింత క్లిష్టంగా మార్చుకుంటున్నారు.
