హైదరాబాద్ ఐటీ కారిడార్లోని నానక్రామ్గూడ ప్రాంతం ట్రాఫిక్ నరకానికి నిలయంగా మారింది. వేలాది ఐటీ కంపెనీలు, బహుళ అంతస్తుల నివాస సముదాయాలు వెలిసిన ఈ ప్రాంతంలో రహదారులు మాత్రం వాహనాల రద్దీకి అనుగుణంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం, సాయంత్రం తిరిగి వచ్చే సమయాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
నానక్రామ్గూడ సర్కిల్, వేవ్ రాక్ జంక్షన్ , ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మార్గాల్లో వాహనాలు అడుగు ముందుకు వేయాలంటే గంటల సమయం పడుతోంది. ఐఎస్ బి రోడ్డు నుంచి ఓఆర్ఆర్ ఎంట్రీ పాయింట్ వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం ఉన్నచోట కూడా వాహనాలు అడ్డదిడ్డంగా నిలపడం వల్ల ట్రాఫిక్ మరింత జటిలమవుతోంది.
కొన్ని చోట్ల కొనసాగుతున్న డ్రైనేజీ పనులు, రోడ్డు విస్తరణ పనులు ట్రాఫిక్ మళ్లింపునకు కారణమవుతున్నాయి. దీనికి తోడు ప్రధాన రహదారుల పక్కన వెలిసిన ఫుడ్ కోర్టులు, అక్రమ పార్కింగ్ వల్ల రోడ్డు ఇరుకుగా మారుతోంది. సర్వీస్ రోడ్లను ఆక్రమించి వాహనాలు నిలపడం వల్ల సాధారణ వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక కిలోమీటర్ దూరం దాటడానికి 45 నిమిషాలు పడుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ ప్రాంతం నిత్యం డార్క్ రెడ్ రంగులో కనిపిస్తుండటం ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇప్పుడే ఇలా ఉంటే.. నిర్మాణంలో ఉన్న హైరైజ్లు పూర్తి అయితే మరిన్ని కష్టాలు వస్తాయి. మౌలిక సదుపాయాలు ఎంత వేగంగా కల్పించినా.. పెరిగిపోతున్న ట్రాఫిక్ ను నియంత్రించడం కష్టమే అవుతుంది.
