హైదరాబాద్‌లోని కోకాపేట జ్రెస్టా విల్లాస్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించి విల్లాలు విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో సదరు ప్రాజెక్టులో మిగిలి ఉన్న యూనిట్లు, ప్లాట్ల విక్రయాలు, బదిలీలు లేదా థర్డ్ పార్టీ హక్కులు కల్పించకుండా ప్రమోటర్లపై మధ్యంతర స్టే విధిస్తూ రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని సర్వే నంబర్ 84లో ఉన్న ఈ ప్రాజెక్టుపై విల్లా కొనుగోలుదారులు దాఖలు చేసిన ఫిర్యాదులను విచారించిన అథారిటీ ఈ మేరకు స్పందించింది.
రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే విక్రయాలు
సుమారు 6 ఎకరాల 14 గుంటల విస్తీర్ణంలో 42 విల్లాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు 2015లోనే హెచ్ఎండిఏ నుంచి లేఅవుట్ అనుమతి లభించింది. అయితే, రియల్ ఎస్టేట్ యాక్ట్, 2016 ప్రకారం ఈ ప్రాజెక్టును రెరాలో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండగా, ప్రమోటర్లు ఆ పని చేయలేదు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే మార్కెటింగ్ చేయడం, విక్రయాలు జరపడం సెక్షన్ 3 కింద ప్రాథమికంగా ఉల్లంఘన అని అథారిటీ నిర్ధారించింది. దీనికి సంబంధించి గతంలోనే డెవలపర్‌కు రూ. 21.79 లక్షల జరిమానా విధించినా తీరు మారకపోవడంతో తాజా కఠిన నిర్ణయం తీసుకుంది.
కోట్లాది రూపాయలు చెల్లించినా అసంపూర్తిగానే
2016 నుంచి 2020 మధ్య ఒక్కో విల్లాకు రూ. 3.44 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చెల్లించి ఒప్పందాలు చేసుకున్నారు. 2021 నాటికి పూర్తి పేమెంట్లు చేసి సేల్ డీడ్లు చేయించుకున్నప్పటికీ, బిల్డర్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమయ్యారు. 2022 నాటికి కేవలం ప్రాథమిక నిర్మాణాలు మాత్రమే పూర్తి కావడంతో, కొనుగోలుదారులు గత్యంతరం లేక అసంపూర్తిగా ఉన్న విల్లాల్లోనే నివాసం ఉంటున్నారు. క్లబ్‌హౌస్, అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ల్యాండ్‌స్కేపింగ్ వంటి కనీస వసతులు కూడా పూర్తి కాలేదని బాధితులు రెరాకు ఫిర్యాదు చేశారు.
నిధుల మళ్లింపు ఆరోపణలు – ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మృగ్యం
విల్లా యజమానులు మరో తీవ్రమైన ఆరోపణ కూడా చేశారు. మెయింటెనెన్స్ , కార్పస్ ఫండ్ కోసం సేకరించిన నిధులను ప్రమోటర్లు మళ్లించారని, ప్రాజెక్టును మధ్యలోనే వదిలేశారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గానీ, కంప్లీషన్ సర్టిఫికేట్ గానీ తీసుకోలేదని వాపోయారు. దీంతో 2023లో నివాసితులంతా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి తమ సమస్యలపై రెరాను ఆశ్రయించారు. తాము చెల్లించిన నిధులను తిరిగి ఇప్పించాలని, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయించాలని వారు కోరుతున్నారు.
గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ స్టే ఆర్డర్ అత్యవసరమని భావించిన టిజి రెరా, ప్రాజెక్టు ఆస్తులను తాకట్టు పెట్టడం లేదా విక్రయించడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 8, 2026కు వాయిదా వేసింది. అప్పటివరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. నిబంధనలు పాటించకుండా వినియోగదారులను మోసం చేసే బిల్డర్లకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
