తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం ఇప్పుడు సొంత గూటిలోనే చిచ్చు లా మారింది. అమరావతి ఉద్యమకారుడనే గుర్తింపుతో చంద్రబాబు నాయుడు ప్రోత్సహించి టిక్కెట్ ఇస్తే, గెలిచిన నాటి నుండి ఆయన తీరు వివాదస్పదంగానే సాగుతోంది. తాజాగా ఆయన తన నియోజకవర్గ పర్యటనలో ముప్పై గ్రామాల్లో రోడ్లు లేవని, నిరుద్యోగం తాండవిస్తోందని, ప్రజలు ఆకలితో ఉన్నారని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడం పెద్ద దుమారం రేపింది. అయితే, ఇవి ప్రజల కష్టాలా లేక పార్టీకి దూరమైన కొలికపూడి వ్యక్తిగత కష్టాలా అన్న సెటైర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.
పూర్తిగా దారి తప్పిన ఎమ్మెల్యే కొలికపూడి
ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కొలికపూడిపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. నియోజకవర్గంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శల దగ్గర నుండి, పార్టీ స్థానిక నేతలతో పొసగకపోవడం వరకు ఆయన గ్రాఫ్ వరుసగా పడిపోతూనే ఉంది. సొంత పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆ అభివృద్ధి పనులను సమన్వయం చేసుకోవాల్సింది పోయి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడంపై టీడీపీ అధిష్టానం తీవ్ర అసహనంతో ఉంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెట్టడం, కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే.. టీడీపీ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిందని స్పష్టమవుతోంది.
వైసీపీతో కలిసే రాజకీయం చేస్తున్నారా?
కొలికపూడి ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ అధికారం పోయిన తర్వాత ఏపీ ప్రజలంతా దిగులుతో..కష్టాల్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ మీడియా ఎలా అనుకుంటుందో.. ఇప్పుడు తన నియోజకవర్గంలో అవే కష్టాలు కనిపిస్తుండటం వెనుక రాజకీయ బేరసారాలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా వైసీపీకి దగ్గరవ్వాలన్న ఆయన ప్రయత్నాలను టీడీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏ పార్టీ వల్ల అయితే ఎమ్మెల్యే అయ్యారో, అదే పార్టీని బజారున పెట్టేలా వ్యవహరించడం ఆయన రాంగ్ రూట్ రాజకీయాలకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.
సస్పెండ్ చేసి పంపిస్తేనే బెటరన్న భావన
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నేతలు ఇప్పుడు కొలికపూడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనను కేవలం దూరం పెట్టడం మాత్రమే కాకుండా, అధికారికంగా సస్పెన్షన్ వేటు వేయాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ గౌరవాన్ని, క్రమశిక్షణను దెబ్బతీసే ఇటువంటి నేతలను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని క్యాడర్ భావిస్తోంది. ఎమ్మెల్యే కావడానికి సహకరించిన వారిని.. నాశనం చేసేటట్లుగా వ్యవహరిస్తున్న కొలికపూడిపై చంద్రబాబు నాయుడు ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
