కేటీఆర్ ఇప్పుడు ఫైర్ మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తావన వస్తే మండిపోతున్నారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కానట్లుగా తిట్లు వచ్చేస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఉండాల్సింది ఇది కాదు. మాట్లాడితే ఆవేశ పడకుండా.. మంట పెట్టేలా ఉండాలి. అది కేసీఆర్ వద్ద పుష్కలంగా ఉంది. కానీ ఆయన వారసుడిగా కేటీఆర్ ఆ ఆయుధాన్ని అందుకోలేకపోతున్నారు.
కేసీఆర్ భాష..రేవంత్ భాషకు పోలికెక్కడ?
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ వాడిన భాష ఒక ప్రత్యేకమైన అస్త్రం. ఆయన మాటల్లో వాడి ఉండేది, వేడి ఉండేది.. అది అవతలి వ్యక్తిని తాకినప్పుడు ఒక రకమైన సెగ పుట్టేది. ఆయన తిట్టినా అందులో ఒక తెలంగాణా యాస, ఒక లోతైన వ్యంగ్యం, ఒక రాజకీయ వ్యూహం ఉండేవి. బూతులు వాడినా అవి ఉద్యమ ప్రయోజనాల కోసం వాడినట్లుగా ప్రజలు భావించేవారు. కానీ, ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి నుంచి రాజకీయ వ్యూహాలే కాదు.. ఆ మాటల మాంత్రికుడి భాషా ప్రావీణ్యాన్ని కూడా వంటబట్టించుకోలేకపోయారనే విమర్శలు ఇప్పుడు పార్టీ క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి.
కేటీఆర్ ప్రసంగాలు వ్యక్తిగత దూషణలే
ఇటీవలి కాలంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వాడుతున్న పదజాలం, కేసీఆర్ మార్కు విమర్శలకు ఏమాత్రం సరిపోలడం లేదు. కేసీఆర్ భాషలో ఒక రకమైన టార్గెటెడ్ ఎనర్జీ ఉండేది, అది తన అనుచరుల్లో ఉత్సాహాన్ని నింపేది. ఇటీవల ఆయన ప్రెస్‌మీట్ లో ఎవర్నీ తిట్టలేదు. కానీ అగ్గి మాత్రం రాజుకునేలా మాట్లాడారు. ఇప్పుడు కేటీఆర్ విమర్శల్లో కేవలం ఆగ్రహం, అసహనం మాత్రమే కనిపిస్తున్నాయి. అది ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కంటే, తనకే మైనస్ అవుతోందనే నిట్టూర్పు బీఆర్ఎస్ నాయకుల్లోనే వ్యక్తమవుతోంది. కేసీఆర్ తిడితే అది ఒక పొలిటికల్ పంచ్ లా ఉండేది, కానీ కేటీఆర్ మాటలు కేవలం వ్యక్తిగత దూషణల్లా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో వారసుడిగా కేటీఆర్ తండ్రి స్థాయి నాయకత్వాన్ని అందుకుంటారని అందరూ భావించారు. అయితే, విపక్షంలో ఉన్నప్పుడు వాడాల్సిన భాషలో కేసీఆర్ చూపిన పరిణతి కేటీఆర్‌లో లోపించిందనేది కేడర్ ఆవేదన. రేవంత్ రెడ్డిని ఎంత తిట్టినా అది ప్లస్ కాకపోవడానికి కారణం, అందులో కేసీఆర్ స్థాయిలో ఉన్న లాజిక్, లోకల్ ఫ్లేవర్ లేకపోవడమే. కేసీఆర్ ఒక మాట అంటే దాని వెనుక ఒక పెద్ద చరిత్రనో లేదా ఒక సామెతనో ఉండేది. కానీ కేటీఆర్ భాషలో ఆ లోతు కనిపించడం లేదని, కేవలం ఆధునిక తిట్లు మాత్రమే వినిపిస్తున్నాయి.
కేటీఆర్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది !
కేసీఆర్ దగ్గర కేటీఆర్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ముఖ్యంగా వ్యూహాల్లో, భాషా ప్రయోగంలో ఆ మాటల మాంత్రికుడి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో ఆయన విఫలమయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. తండ్రి తిట్టినా జనం చప్పట్లు కొట్టారు, కానీ కొడుకు తిడుతుంటే జనం ఎందుకు పెదవి విరుస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు బీఆర్ఎస్ అంతర్గత చర్చల్లో ప్రధానాంశమైంది. వారసత్వంగా ఆస్తులు, హోదాలు రావచ్చు కానీ, ఆ వాగ్ధాటిని తెచ్చుకోవడం మాత్రం కేటీఆర్ వల్ల కావడం లేదన్నది వాస్తవం.
