రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు.. లిక్కర్ కేసు ఎంత బలంగా ఉందో నిరూపిస్తంది. ఏపీ హైకోర్టు గతంలోనే ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దానిని సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. నిందితుడి తరపు న్యాయవాదులు వాదనలు ప్రారంభించగానే, పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణకు మొగ్గు చూపలేదు.
రాజ్ కేసిరెడ్డి కింగ్ పిన్ – అసలు సూత్రధారి ఎవరు?
రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి కొట్టిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా రాజ్ కేసీరెడ్డిని సుప్రీంకోర్టు అభివర్ణించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అని స్పష్టం చేసింది. పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదని తేల్చి చెప్పడం ద్వారా.. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఎంత బలంగా ఉన్నాయో కోర్టు పరోక్షంగా వెల్లడించింది. ఆర్థిక నేరాలలో నిందితులకు ఊరటనివ్వడం సరైనది కాదని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. మద్యం కుంభకోణంలో రాజ్ కేసీరెడ్డి కేవలం ఒక ముసుగు మాత్రమేనని, దీని వెనుక అసలు కథానాయకుడు ఉన్నారన్నది బహిరంగ రహస్యం.
పాలసీలు మార్చి పక్కా దోపిడీ
పారదర్శకతను పక్కనపెట్టి, డిజిటల్ చెల్లింపులను కాదని, కేవలం నగదు రూపంలోనే మద్యం విక్రయాలు జరిపించి వేల కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఈ వ్యవస్థ వెనుక పెద్దల హస్తం ఉందని మొదటి నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్ కేసీరెడ్డిని ప్రధాన సూత్రధారి గా పేర్కొనడంతో, దర్యాప్తు సంస్థల చూపు సహజంగానే ఈ చక్రం తిప్పిన అసలు బాస్ వైపు మళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మద్యం సరఫరా , డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో జరిగిన భారీ అవకతవకలపై విచారణ సంస్థలు ఇప్పటికే లోతైన సాక్ష్యాధారాలను సేకరించాయి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ దర్యాప్తుకు మరింత చట్టబద్ధమైన బలాన్ని చేకూర్చాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ వ్యవస్థపై లోతైన విచారణ జరిగితే, తదుపరి సంచలన పరిణామాలు నేరుగా వైసీపీ అధినాయకత్వాన్నే తాకే అవకాశం ఉంది.
బాస్‌ను వదిలి పెట్టరుగా!
ఈ కేసులో రాజ్ కేసీరెడ్డి బెయిల్ నిరాకరణ అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు దోషులు బయటకు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, ఈ నిర్ణయం కుంభకోణంతో సంబంధం ఉన్న ఇతర నిందితులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. కింగ్పిన్కే బెయిల్ దక్కని పరిస్థితుల్లో, మిగిలిన పాత్రధారులు కూడా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కోర్టు వ్యాఖ్యలు లోతైన దర్యాప్తుకు మార్గం సుగమం చేయడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


