హైరైజ్ అపార్టుమెంట్లలో ఇల్లు కొనాలనుకునే సగటు మధ్యతరగతి జీవికి బేస్ ప్రైస్ ఓ ట్రాప్ లాంటిది. కోటిన్నర రూపాయలకు ఫ్లాట్ అని ప్రకటనల్లో చూసి బడ్జెట్ వేసుకుంటే, తీరా రిజిస్ట్రేషన్ సమయానికి ఆ మొత్తం మరో 20 నుంచి 25 శాతం పెరిగి షాక్కు గురిచేస్తోంది. అంటే, కోటిన్నర ప్లాన్ చేసిన ఇల్లు అన్ని ఖర్చులు కలిపి దాదాపు రూ. 1.80 కోట్ల నుండి రూ. 1.90 కోట్ల వరకు చేరుతోంది. ఈ అదనపు భారం వెనుక ఉన్న లెక్కలను విశ్లేషిస్తే సామాన్యులకు అంతుచిక్కని ఎన్నో అంశాలు కనిపిస్తాయి.
ప్రధానంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులే సింహభాగం ఉంటాయి. తెలంగాణలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ అన్నీ కలిపి సుమారు 7.5% వరకు ఉంటాయి. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ అయితే మరో 5% జీఎస్టీ అదనం. కేవలం ఈ పన్నుల రూపంలోనే సుమారు రూ. 18 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఇల్లు మన పేరు మీదకు రావడానికే లక్షల రూపాయలు ప్రభుత్వం ఖాతాలోకి వెళ్తాయి.
ఇక బిల్డర్లు వసూలు చేసే ఎమెనిటీస్ ఖర్చులు మరో ఎత్తు. కార్ పార్కింగ్, క్లబ్ హౌస్ మెంబర్షిప్, విద్యుత్ , నీటి కనెక్షన్ ఛార్జీలు, జనరేటర్ బ్యాకప్ వంటి వాటి పేరుతో రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తారు. వీటికి తోడు హైరైజ్ అపార్టుమెంట్లలో ఫ్లోర్ పెరిగే కొద్దీ ఫ్లోర్ రైజ్ ఛార్జీలు, వ్యూ బాగుంటే ప్రిఫరెన్షియల్ లొకేషన్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.
ఇవన్నీ కాకుండా అడ్వాన్స్ మెయింటెనెన్స్, కార్పస్ ఫండ్ పేరుతో మరో రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు ముందుగానే కట్టించుకుంటారు. ఇల్లు స్వాధీనం చేసుకున్నాక అసలైన ఇంటీరియర్ ఖర్చు మొదలవుతుంది. కోటిన్నర పెట్టి కొన్న ఇంటికి తగ్గట్టుగా వార్డ్రోబ్స్, మోడ్యులర్ కిచెన్, ఫాల్స్ సీలింగ్ వంటి హంగుల కోసం కనీసం రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షలు వెచ్చించాల్సి వస్తుంది. వెరసి, అడ్వర్టైజ్మెంట్లలో కనిపించే కోటిన్నర ధర.. గృహ ప్రవేశం చేసే నాటికి సుమారు రెండు కోట్లకు చేరువవుతోంది. కాబట్టి, హైరైజ్ ఫ్లాట్ బుక్ చేసే ముందే ఆల్ ఇన్ కాస్ట్ ఎంతో అడిగి తెలుసుకోవడం ఉత్తమం.


