హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఎదుగుతున్న కోకాపేట నియోపొలిస్ ప్రభావం నేరుగా పొరుగునే ఉన్న కొల్లూరుపై పడుతోంది. నియోపొలిస్‌లో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరడం, అక్కడ లగ్జరీ ప్రాజెక్టుల రాకతో సామాన్య, మధ్యతరగతి ఇన్వెస్టర్లు కొల్లూరు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో చదరపు అడుగుకు 10-12 శాతం ధరలు పెరగినట్లుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ. 6,000 నుండి రూ. 9,000 వరకు పలుకుతుండగా, విల్లాలు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.
గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కారిడార్లకు అతి సమీపంలో ఉండటం కొల్లూరుకు పెద్ద ప్లస్ పాయింట్. కేవలం 15-20 నిమిషాల్లో ప్రధాన కార్యాలయాలకు చేరుకోవచ్చనే ఉద్దేశంతో ఐటీ నిపుణులు ఇక్కడ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా కొల్లూరుకు కనెక్టివిటీ లభిస్తుందనే వార్తలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి. వెస్ట్రన్ కారిడార్‌లో గచ్చిబౌలి, కోకాపేటల తర్వాత మూడవ అతిపెద్ద గ్రోత్ సెంటర్ గా కొల్లూరు అవతరించబోతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 2 కి సమీపంలో ఉండటం వల్ల కొల్లూరుకు అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. ఇక్కడ రోడ్లు 8 లేన్ల వెడల్పుతో ఉండటం, భవిష్యత్తులో రాబోయే భారీ షాపింగ్ మాల్స్, అంతర్జాతీయ పాఠశాలలు ఈ ప్రాంత రూపురేఖలను మారుస్తున్నాయి. ఐదేళ్ల కాలంలో ఇక్కడ ఆస్తుల విలువ దాదాపు 116 శాతం పెరగడం దీనికి సంకేతం. కేవలం నివాసం కోసమే కాకుండా, అధిక అద్దె ఆదాయం ఆశించే ఇన్వెస్టర్లకు కూడా కొల్లూరు ఇప్పుడు ప్రధాన గమ్యస్థానంగా మారింది.
