ఓటీటీపై కోలీవుడ్ కీల‌క నిర్ణ‌యం.. త్వ‌ర‌లో ఇక్క‌డ‌ కూడా..?

ఓటీటీ వేదిక వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలున్నాయో, అన్నే న‌ష్టాలున్నాయి. సినిమా విడుద‌లైన నెల రోజుల‌కే అమేజాన్, హాట్ స్టార్‌, జీ లాంటి ఓటీటీ వేదిక‌ల‌పై ద‌ర్శ‌న మిచ్చేస్తోంది. 50 రోజుల త‌ర‌వాత‌… టీవీల్లో వేసేసుకోవొచ్చు. దాంతో సినిమా ఏమాత్రం కాస్త అటూ ఇటూ ఉన్నా, థియేట‌ర్ల‌కు జ‌నం వెళ్ల‌డం లేదు. కాక‌పోతే ఓటీటీ, శాటిలైట్‌ వ‌ల్ల‌.. నిర్మాత‌ల‌కు విడుద‌ల‌కు ముందే ఎంతో కొంత నికర మొత్తం వ‌చ్చేస్తోంది. సినిమా ఫ్లాప్ అయినా, స్వ‌ల్ప న‌ష్టాల‌తో బ‌య‌ట‌ప‌డొచ్చు. కాక‌పోతే మ‌రీ నెల రోజుల‌కే కొత్త సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో క‌నిపించ‌డం సినిమాకి మంచిది కాద‌ని, థియేట‌ర్ల‌కు దెబ్బ అని నిర్మాత‌లు కంగారు పడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మిళ సినీ రంగం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సినిమా విడుద‌లైన 8 వారాల వ‌ర‌కూ… ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ప్ర‌ద‌ర్శించ‌డానికి వీలులేద‌ని, టీవీలో ప్ర‌ద‌ర్శించాల‌న్నా క‌నీసం 100 రోజులు ఆగాల‌న్న ప్ర‌తిపాద‌ల్ని ఓకే చేసింది కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌. అందుకు ఓటీటీ సంస్థ‌లు, టీవీ ఛాన‌ళ్లు కూడా అంగీక‌రించాయి. త్వ‌ర‌లోనే ఇలాంటి మార్పు టాలీవుడ్‌లోనూ జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అగ్ర నిర్మాత‌లంతా ఈ విష‌య‌మై ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌తోనూ, టీవీ ఛాన‌ళ్ల య‌జమానుల‌తోనూ మాట్లాడారు. అటు వైపు నుంచి కూడా సానుకూల స్పంద‌నే వ‌స్తోంది. కాక‌పోతే ఓ సినిమా ఫ్లాప్ అయితే… దాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి రెండు నెల‌లు ఆగ‌డం క‌రెక్ట్ కాక‌పోవొచ్చు. సినిమా ఫ‌లితంతో ఆలోచించ‌కుండా, విడుద‌ల‌కు ముందే కోట్లు పెట్టి కొన్న సంస్థ‌లు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. సినిమా గ‌నుక ఫ్లాప్ అయి, థియేట‌ర్ల‌లో లేక‌పోతే, నిర్మాత‌ల అనుమ‌తితో కాస్త ముందుగానే ప్ర‌ద‌ర్శించుకునే క్లాజ్ తో ఈ కొత్త మార్పు అమ‌లు అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com