కేసీఆర్, కేటీఆర్ ల‌ను ఆకాశానికి ఎత్తేసిన రాజ‌గోపాల్ రెడ్డి!

కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న ఉన్నారా, ఉంటారా అనే గంద‌ర‌గోళం సొంత పార్టీలోనే ఉంది! కాసేపు పార్టీలు ఉన్న‌ట్టు మాట్లాడితే, ఇంకాసేపు వేరే పార్టీకి వెళ్తార‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు. ఆయ‌న పార్టీ మార‌తారేమో అనే చ‌ర్చ… అలానే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తీరు ఇంకా ప్ర‌శ్నార్థ‌కంగానే మిగిలుంది. ఇప్ప‌టికే ఉన్న గంద‌ర‌గోళం చాల‌దు అన్న‌ట్టుగా.. ఇప్పుడు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ని, మంత్రి కేటీఆర్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతూ అసెంబ్లీలో మాట్లాడారు. దీంతో ఇంకోసారి ఆశ్చ‌ర్యపోవ‌డం కాంగ్రెస్ నేత‌ల వంతైంది!

మంత్రి కేటీఆర్ యువ‌కుడు, విదేశాల్లో చ‌దువుకుని వ‌చ్చిన వ్యక్తి, రెండోసారి ప్ర‌జ‌లు వారికి అధికారం క‌ట్ట‌బెట్టార‌నీ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న తాము స‌హ‌క‌రిస్తామ‌ని రాజ‌గోపాల్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి ప‌నులు చేస్తే అభినందిస్తామ‌నీ, అవ‌సర‌మైతే సన్మానం చేస్తామ‌నీ, పార్టీ వేరైనా స‌రే మంచి ప‌నులు చేస్తే మెచ్చుకోవ‌డంలో ముందుంటాన‌న్నారు! ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే త‌న‌కు చాలా గౌర‌వ‌మ‌నీ, ఎన్నిక‌లప్పుడు మాత్ర‌మే రాజ‌కీయాల‌నీ, ఎల‌క్ష‌న్లు ఎప్పుడో అయిపోయాయ‌నీ, ఇప్పుడు అంతా అభివృద్ధీ ప్ర‌జాసంక్షేమం మాత్ర‌మే అన్నారు. కేటీఆర్ చాలా ప‌రిశ్ర‌మ‌లు తెచ్చార‌నీ, అభివృద్ధి బాగా చేస్తున్నార‌న్నారు. కేసీఆర్, కేటీఆర్ ల‌తో క‌లిసి తాను కుటుంబ స‌భ్యునిగా ఎప్పుడూ క‌లిసి ఉంటాన‌న్నారు. అయితే, గ‌త కాంగ్రెస్ హ‌యాంలో చాలా మంచి ప‌నులు జ‌రిగాయ‌న్న‌ది కూడా గుర్తుంచుకోవాల‌న్నారు. గ‌త పాల‌కులు అంటూ విమ‌ర్శ‌లు చేస్తుంటార‌నీ, కాంగ్రెస్ లో మొత్తం చెడ్డొళ్లేనా, మాలాంటోళ్లు లేరా… అనగానే స‌భ అంతా గొల్లున న‌వ్వులు వినిపించాయి!

ఇంత‌కీ ఏ ఉద్దేశంతో రాజ‌గోపాల్ రెడ్డి ఈ ప్ర‌సంగం చేసిన‌ట్టు..? ఆయ‌న మాటలు కాంగ్రెస్ ఉప‌యోగ‌ప‌డేలా ఉన్నాయా.. అస్స‌లు లేవు! కేసీఆర్, కేటీఆర్ ల‌ను మెచ్చుకోవ‌డం వ‌ల్ల కాంగ్రెస్ హ‌ర్షిస్తుందా.. ఛాన్సే లేదు. వ్య‌క్తిగ‌తంగా రాజ‌గోపాల్ రెడ్డి వ్యూహాత్మ‌కంగానే ఇలా మెచ్చుకోళ్లు మొద‌లుపెట్టారా… ఏమో, కాద‌న‌లేని ప‌రిస్థితి! ఎలా అంటే… కాంగ్రెస్ లో ఆయ‌న ఉంటారో ఉండ‌రో తెలీదు. ఉంటాన‌ని అంటూనే, అంద‌రికీ చెప్పే వెళ్తాను క‌దా అని ప్ర‌తీసారి అంటారు. ఉంటార‌ని అనుకున్న‌ప్పుడు ఆ రెండో మాట ఎందుకు? అలాగ‌ని, భాజ‌పాలోకి ఇప్పుడు ఆయ‌న వెళ్లే ప‌రిస్థితి ఉందా.. ఆల‌స్యం చేయ‌డంలో అక్క‌డ కూడా త‌లుపులు దాదాపుగా మూసుకుపోయిన ప‌రిస్థితి. ఇక మిగిలిన ద్వారం ఏది..? సింహ‌ద్వారం ఎదురుగా క‌నిపిస్తున్నా, గ‌ట్టిగా త‌లుపులేసేసి ఉన్నాయి. ఇప్ప‌ట్నుంచీ మొద‌లుపెడితే ఎప్ప‌టికైనా తెరుచుకోక‌పోతాయా అనే ఆశ ఏదైనా రాజ‌గోపాల్ లో ఉందా… ఏమో ఎవ‌రికి తెలుసు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com