మునుగోడు నియోజకవర్గాన్ని కోమటిరె్డ్డి రాజగోపాల్ రెడ్డి సొంత సామ్రాజ్యంగా ప్రకటించుకున్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేసే నిర్ణయాలు తన వద్ద చెల్లవని స్పష్టం చేశారు. మునుగోడుకు కొత్త రూల్స్ సెట్ చేస్తూ బహిరంగ ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా దరఖాస్తులు చేసే వారందరికీ రాజగోపాల్ రెడ్డి తన సందేశం పంపించారు.
వైన్ షాపులు ఊరి బయటే ఉండాలని.. సిట్టింగ్ నడపకూడదన్నారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు, సిండికేట్ ఉండొద్దని స్పష్టం చేశారు. అదే సమయంలో సాయంత్రం 4:00గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకే మద్యాన్ని విక్రయించాలని రూల్ పెట్టారు ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక అన్నారు.
మద్యం దుకాణాలకు టెండర్లు వేసే వారిని భయపెట్టడానికి ఇలా రాజగోపాల్ రెడ్డి ముందస్తుగా బెదిరించారని..తనను కాదని మద్యం దుకాణాలు నడపలేరన్న సంకేతాలను ఇలా పంపించారని అంటున్నారు. కేవలం సాయంత్రం పూట మాత్రమే మద్యం అమ్మాలి.. ఊరు బయటే దుకాణాలు ఉండాలని ఆయన రూల్స్ పెట్టడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ప్రభుత్వ రూల్స్ ను కాదని.. తన సొంత రూల్స్ ను ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతంది.