సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. పవన్ కల్యాణ్ సినిమాలను ఆడనివ్వబోనని..రిలీజ్ కానివ్వబోనని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు పూర్తిగా చల్లబడిపోయారు. అప్పటి పరిస్థితుల వల్ల పవన్ పై అలా వ్యాఖ్యలు చేశానని..నేను ఇప్పుడు ఎవర్నీ విమర్శించడం లేదని లైట్ తీసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ కి సీఎం చంద్రబాబుని ఆహ్వానించేందుకు అమరావతి వచ్చారు. చంద్రబాబును ఆహ్వానించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ మాకు ప్రత్యేకమని.. గతంలో సీఎం చంద్రబాబు విజన్-2020 అంటే ఆశ్చర్యపోయానన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ని చూస్తే నిజం అనిపిస్తోందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నారు.
అదే సమయంలో తన రాజకీయ గురువు వైఎస్ కుమారుడు.. తమకు కూడా ఆత్మీయుడు అయిన జగన్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పని స్పష్టం చేశారు. అధికారపక్షం తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షానికే బాధ్యత ఉంటుందన్నారు. తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ విలీనం చేసుకున్న తర్వాత.. తమకు ఆరుగురే ఎమ్మెల్యేలున్నా.. తాము అసెంబ్లీలో పోరాడామని ఆయన గుర్తు చేసుకున్నారు. జగన్ రెడ్డికి ఈ సలహా మంట పుట్టించడం ఖాయమని అనుకోవచ్చు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వారం రోజుల తర్వాత అనూహ్యంగా స్పందించడంతోనే ఏదో జరిగి ఉంటుందని అనుకున్నారు. కోమటిరెడ్డి కూడా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా స్పందించానని.. ఇప్పుడు ఎవర్నీ విమర్శించబోనని చెప్పడంతో.. ఎవరో ఆదేశించడం ద్వారానే విమర్శలు చేసినట్లుగా క్లారిటీ వచ్చినట్లయిందని అనుకోవచ్చు.