సంగారెడ్డిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో పెనుదుమారాన్ని రేపాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మాస్ లీడర్ కాదని, జగ్గారెడ్డి వంటి బలమైన నాయకుడు ఆ పదవిలో ఉంటే పార్టీకి వంద సీట్లు వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ను తక్కువ చేసినట్లుగా ఉండటంతో ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి, సొంత పార్టీ అధ్యక్షుడికి ప్రజాబలం లేదన్నట్లుగా మాట్లాడటం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వ్యాఖ్యల సెగ వెంటనే తగలడంతో కోమటిరెడ్డి కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని, మహేష్ కుమార్ గౌడ్ తనకు పాత మిత్రుడని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, బహిరంగ వేదికపై ఆయన చేసిన పోలికలు ఇప్పటికే పీసీసీ వర్గాలకు చేరిపోయాయి. జగ్గారెడ్డిని పొగిడే క్రమంలో పీసీసీ చీఫ్‌ను తక్కువ చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటన్నది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదం వల్ల కోమటిరెడ్డికి జరగాల్సిన రాజకీయ నష్టం ఇప్పటికే జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ దృష్టిలో ఆయనకు నెగటివ్ మార్కులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. పైకి అంతా బాగుందని చెబుతున్నా, అంతర్గతంగా మాత్రం ఈ మాస్ లీడర్ వివాదం మున్ముందు మరిన్ని మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా లేకపోతే.. జగ్గారెడ్డిని పొగిడే క్రమంలో మాట్లాడారా అన్నదానిపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలున్నాయి.


