సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ లో చేరినా ప్రయోజనం లేకుండా పోయిందని .. రాజకీయంగా కూడా తనను పట్టించుకోవడంలేదని లేదని అసంతృప్తిలో ఉన్న ఆయనను బీఆర్ఎస్ హైకమాండ్ పిలిచి కండువా తప్పింది. ఆయన సోదరుడు, మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్లో చేరారు.
కోనప్ప గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ తరపునే పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ బీజేపీ గెలిచింది. బీఎస్పీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చడంతో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకోవడంతో ఆయన బీఆర్ఎస్ పెద్దలపై ఆగ్రహంతో పార్టీని వీడారు. కోనప్ప మొదటి సారి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ లో టిక్కెట్ రాకపోవడంతో ఆయన , ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరూ కలిసి బీఎస్పీ తరపున పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లోనూ గెలిచారు. గత ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ వల్ల ఓడిపోయారు.
ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యంతో తనకు ఇక సిర్పూర్ లో చాన్స్ రాదనుకున్న కోనప్ప కాంగ్రెస్లో చేరారు. అక్కడ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. పైగా కాంగ్రెస్ నేతలు చికాకు పెట్టడం ప్రారంభించారు. దాంతో పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సారి ప్రవీణ్ కు ఎంపీ లేదా.. ఇతర నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇస్తామని సిర్పూర్ ఆయనదేనని కేటీఆర్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.