బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పార్టీలో పరిస్థితులు ఏ మాత్రం నచ్చడం లేదు. ఆయన చేవెళ్ల నుంచి ఎంపీగా ఉన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి పార్టీ వ్యవహారాలు గందరగోళంగా ఉన్నాయని ఆయన పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే పట్టించుకునేవారు లేరు. విసిగిపోయిన ఆయన పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శిగా ఉన్న చంద్రశేఖర్ తివారికీ ఓ ఫుట్ బాల్ బహుమతిగా ఇచ్చారు. అది ఎందుకంటే.. పార్టీలో తనను ఫుట్బాల్ లాగే ఆడుకుంటున్నారని అలా నిరసన వ్యక్తం చేశారన్నమాట.
తివారితో మాట్లాడితే.. తానేం చేయలేనని రామచంద్రరావును అడగాలంటున్నారు.. రామచంద్రారావును అడిగితే అభయ్ పాటిల్ అనే నేతను కలవాలనుంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఎంపీగానే కాదు.. రాజకీయాల్లోనూ మహా యాక్టివ్ గా ఉండే విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల అంత యాక్టివ్ గా లేరు. పెద్దగా బయట కనిపించడం లేదు. కొత్త బీజేపీ అధ్యక్షుడు వచ్చినా ఆయన ఇంకా తెర వెనుకే ఉన్నారు.
బీజేపీలో ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగా ఆయన వెనకుబడిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన తనకు పార్టీతో సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారంటూ ఓ వీడియో కూడా వైరల్ అయింది. ఇలాంటి వ్యవహారాలతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరచూ అసంతృప్తి వ్యవహారంతో తెరపైకి వస్తున్నారు. సీఎం రేవంత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నా ఆయన కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ టిక్కెట్ ఇస్తామన్న ఆయన పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరలేదు. బీజేపీలోనే ఉండి పోటీ చేసి గెలిచారు.