కొండ‌పొలం సినిమా రివ్యూ : వ్య‌క్తిత్వ వికాస పాఠం !

తెలుగు360 రేటింగ్ : 2.5/5

న‌వలా చిత్రం…ఎంత కాల‌మైంది? ఈ మాట విని !?

ఓ న‌వ‌ల‌ని చ‌ద‌వ‌డం వేరు. దాన్ని అర్థం చేసుకుని సినిమాగా తీయ‌డం వేరు. ఎందుకంటే ప్రేక్ష‌కుడు – పాఠ‌కుడు ఇద్ద‌రి ఆలోచ‌న‌లు వేర్వేరు. ఓ క‌థ చ‌దువుతూ, ఆ పాత్ర‌ల్ని ఊహించుకుంటూ, ఊహాలోకంలో తేలిపోవ‌డం వేరు. ఆ పాత్ర‌ల్ని తెర‌పై ప్ర‌తిష్టించ‌డం వేరు. ఓ పాపుల‌ర్ న‌వ‌లని సినిమాగా తీయ‌డం క‌త్తిమీద సాము.`కొండ పొలం` అనే అవార్డు న‌వ‌ల‌ని చ‌ద‌వ‌గానే… ఇది సినిమాగా ఎందుకు తీయ‌కూడ‌దు? అనే ప్ర‌శ్న వేసుకున్నాడు క్రిష్‌. ఫ‌లిత‌మే ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రాయ‌ల‌సీమ జీవితాన్ని, వృత్తి రీత్యా వాళ్లు సాగించే కొండ‌పొలం అనే పోరాటాన్నీ.. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి న‌వ‌ల‌లో ఎలా ఆవిష్క‌రించాడు? దాన్ని క్రిష్ తెర‌పై ఎలా తీసుకొచ్చాడు? కాస్త వివ‌రంగా చెప్పుకుంటే..

ర‌వి (వైష్ణ‌వ్ తేజ్‌) గొర్రెల కాప‌రుల కుటుంబం నుంచి వ‌చ్చాడు. త‌న‌ది రాయ‌ల‌సీమ ప్రాంతం. నిత్యం క‌రువు కాట‌కాల‌తో సీమ మ‌గ్గిపోతుంటుంది. డిగ్రీ చ‌దివినా, ప‌ట్నంలో ఉద్యోగం సంపాదించ‌లేక‌పోతాడు ర‌వి. ఇంగ్లీష్ భాష‌పై ప‌ట్టులేక‌, ఇంట‌ర్వ్యూల‌లో నెగ్గుకురాలేక స‌త‌మ‌త‌మై – మ‌ళ్లీ ఇంటికే వ‌చ్చేస్తాడు. త‌ను ఇంట‌కొచ్చేస‌రికి… క‌రువు మ‌రింత ముదురుతుంది. గొర్రెల‌కు గ‌డ్డి, నీళ్లూ లేకుండాపోతాయి. రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఎప్పుడు క‌రువొచ్చినా, గొర్రెల మేత కోసం మంద‌నేసుకుని అడ‌వికి పోతుంటారు. వ‌ర్షాలు ప‌డ్డాకే తిరిగి ఇళ్ల‌కు చేర‌తారు. ఆ ప్ర‌యాణాన్నే కొండ‌పొలం అంటారు. తాత‌య్య (కోట శ్రీ‌నివాస‌రావు) మాట‌ల‌తో ప్ర‌భావిత‌మైన ర‌వి.. తండ్రి (సాయి చంద్‌)తో పాటుగా గొర్రెల మంద‌ని మేపుకుంటూ అడ‌వికి వెళ్తాడు. అయితే ఆ ప్ర‌యాణం.. నిత్యం ప్ర‌మాదంతో స‌హ‌వాసం లాంటిది. మ‌ధ్య‌లో ఎన్నో ఆటంకాలు. ముఖ్యంగా అడ‌విలో పెద్ద‌పులులుంటాయి. వాటి నుంచి త‌మ‌ని తాము కాపాడుకుంటూ, గొర్రెల మంద‌ని ర‌క్షించుకోవాలి. మ‌రి ఈ ప్ర‌యాణం ఎలా సాగింది? అడ‌వి నుంచి తిరిగొచ్చాక‌.. ఆ స్ఫూర్తితో ర‌వి ఐ.ఎఫ్‌.ఎస్ (ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్‌)కి ఎలా ఎంపిక‌య్యాడు? అడ‌విని రక్షించే బాధ్య‌త ఎలా భుజాన వేసుకున్నాడు? అనేది మిగిలిన క‌థ‌.

ఓ గొర్రెల మంద‌ని మేపుకుంటూ అడ‌వికి వెళ్ల‌డ‌మే – కొండ‌పొలం అనుకుంటే అస‌లు ఆ న‌వ‌ల‌కీ ఇంత విలువ వ‌చ్చేది కాదు. ఆ ప్ర‌యాణంలో ర‌చ‌యిత ఎన్నో విష‌యాల్లో అంత‌ర్లీనంగా బోధించాడు. ఓర‌కంగా ఇది క‌థ కాదు. వ్య‌క్తిత్వ వికాస పాఠం.`ఈ అడ‌వి ఓ పెద‌బాల‌శిక్ష‌` అంటూ ఓబుల‌మ్మ పాత్ర‌తో ప‌లికించాడు క్రిష్‌. ఎంత మంచి మాట…? అడ‌విలో క్రూర మృగాలుంటాయ‌నుకుంటాం. వాటిని వ‌ధించ‌డం వీర‌త్వం అని భావిస్తాం. నిజానికి మృగాల నివాస‌మే అడ‌వి. మ‌నిషికి అందులోకి వెళ్లే హ‌క్కు ఎక్క‌డుంది? వెళ్లాల‌న్నా చుట్ట‌పుచూపుగా వెళ్లాల్సిందే. ఆకుల్ని, అల‌మ‌ల్ని, చెట్టూ చేమ‌ల్ని, క‌నిపించే మృగాల్నీ చుట్టాల‌నుకోవ‌డ‌మే. తిరిగి వ‌చ్చేయ‌డ‌మే. కానీ అది చేస్తున్నామా? మ‌న స్వార్థం కోసం చెట్ల‌ని న‌రికేస్తున్నాం. అడ‌విని నాశ‌నం చేస్తున్నాం. మ‌రో త‌రానికి వార‌స‌త్వంగా ఇవ్వాల్సిన సంప‌ద‌ని స‌మాధి చేస్తున్నాం. ఇదే కొండ‌పొలంలో పాత్ర‌ల ద్వారానో, సంభాష‌ణ‌ల ద్వారానో, సంఘ‌ట‌న‌ల ద్వారానో అక్క‌డ‌క్క‌డ చెప్పాల‌నుకున్నాడు క్రిష్‌.

ఉద్యోగానికీ – అడ‌విలో ప్ర‌యాణానికీ ఓ ముడి వేశాడు ర‌చ‌యిత‌. ఇంట‌ర్వ్యూలు, అక్క‌డ అడిగే ప్ర‌శ్న‌ల్ని పెద పులితో పోల్చాడు. వాటిని దాటుకుని ఎలా రావాలో కూడా చెప్పాడు. ఆ ర‌కంగా `కొండ‌పొలం`ని అర్థం చేసుకుంటే అదో విలువైన పాఠంగా మారుతుంది. క‌రువు – కాట‌కాల గురించి, రాయ‌ల‌సీమ వాళ్ల‌కే బాగా తెలుసు. వ‌ర్షం వ‌స్తే – చాలామందికి అదో అనుభూతి. టైమ్ పాస్‌. ఓ అంద‌మైన వ‌ర్ణ‌ణ‌. కానీ క‌రువు ప్రాంతం వాళ్ల‌కు వాన ఓ దేవుడు. ఆ చినుకులు ఆక‌లి తీర్చే మెతుకులు. వానొచ్చిన‌ప్పుడు త‌డిసిన మ‌ట్టిని మొహానికి అద్దుకున్న వైనం – అప్పుడు పుట్టుకొచ్చే ఓర‌క‌మైన అలౌకిక ఆనందం క‌రువు పీడిత ప్రాంత ప్ర‌జ‌ల‌కే బాగా తెలుసు. అలాంటి క్ష‌ణాల్ని క్రిష్ క్యాప్చ‌ర్ చేయ‌గ‌లిగాడు.

ఓ సంద‌ర్భంలో గొర్రెల‌కు నీరు దొర‌క‌దు. అవ‌న్నీ దాహంతో అల్లాడిపోతుంటాయి. అలాంట‌ప్పుడు ఉన్న ఆ కాసిన్ని నీళ్ల‌తో గొంతు త‌డుపుకోమ‌ని సాయిచంద్ కి నీళ్ల బాటిల్ అందిస్తే `ఇన్ని జీవాలు దాహంతో త‌పిస్తుంటే నేను నీళ్లు తాగ‌గ‌ల‌నా` అంటాడు. నిజానికి ఇదో ఎమోష‌న‌ల్ సీన్ గానే చూడ‌కూడ‌దు. మూగ జీవాల‌కు మ‌నిషి ఇవ్వాల్సిన విలువ‌ని కూడా ర‌చ‌యిత బోధించిన‌ట్టైంది.

అడ‌విలోకి ప్ర‌వేశించాక‌… కాస్త వేగం పుంజుకుంటుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆయా పాత్ర‌ల మ‌ధ్య ఎమోష‌న్‌, ఓబుల‌మ్మ‌తో ప్రేమ‌, పులి పోరాటం ఇలా క‌థ‌ని బాగానే డ్రైవ్ చేశాడు. కాక‌పోతే.. అక్క‌డ‌క్క‌డ స్లో ఫేజ్ ఇబ్బంది పెడుతుంటుంది. ప‌తాక స‌న్నివేశాల్లో పులి చ‌నిపోయిందా? భ‌య‌ప‌డి పారిపోయిందా? అనేది ఓ ఫ‌జిల్ గా వ‌దిలేశారు. నిజానికి క‌థ‌కు అంత‌కు మించిన స‌మాచారం కూడా అవ‌స‌రం లేదు.

వైష్ణ‌వ్ తేజ్‌కి ఇది రెండో సినిమా. యువ‌త‌రం క‌థానాయ‌కుడు.. ఇలాంటి పాత్ర‌ని ఎంచుకోవ‌డం నిజంగా సాహ‌స‌మే. ఎందుకంటే ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లూ లేవు.కేవ‌లం క‌థ‌తో, పాత్ర‌తో ప్ర‌యాణం చేయాలి. అయినా స‌రే.. రంగంలోకి దూకేశాడు. త‌న పాత్ర‌కు నూటికి నూరుపాళ్లూ న్యాయం చేశాడు. ఓబుల‌మ్మ‌గా ర‌కుల్ మెప్పిస్తుంది. డీ గ్లామ‌ర్ పాత్ర అది.అయితే అక్క‌డ‌క్క‌డ మేక‌ప్ అద్దారేమో అనిపిస్తుంది. ఆ అవ‌స‌రం కూడా ఆ పాత్ర‌కు లేదు. సాయి చంద్ పాత్ర గుర్తుండిపోతుంది. వాన స‌న్నివేశంలో త‌న న‌ట‌న ప్ర‌శంసార్హం. ర‌వి ప్ర‌కాష్ కి సైతం మంచి సీన్లు రాశాడు ద‌ర్శ‌కుడు.

ఇలాంటి ప్ర‌య‌త్నం ఒక్క క్రిష్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు. ఎక్క‌డా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌కు లొంగిపోకుండా. అలాగ‌ని మ‌రీ విసిగించ‌కుండా కొండ‌పొలం అనే న‌వ‌ల‌కు న్యాయం చెయ్యడానికి ప్రయత్నించాడు. కీర‌వాణి నేప‌థ్య సంగీతం మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. త‌న పాట‌ల‌కు సైతం కొత్త‌గా వినిపించాయి. ద‌ట్ట‌మైన అడ‌విలో సినిమా తీయ‌డం మాట‌లు కాదు. చాలా క‌ష్ట‌ప‌డాలి. కొండ‌లూ కోన‌లూ తిర‌గాలి. అక్క‌డికి కెమెరాలూ, సామాగ్రి మోసుకెళ్లాలి. అలాంట‌వ‌న్నీ ఎలా చేశారో అనిపిస్తుంది. క్వాలిటీ ప‌రంగా ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు.. కొండ‌పొలం రాసిన ర‌చ‌యితే ఈ సినిమాకీ సంభాష‌ణ‌లు అందించారు. కాబ‌ట్టి రాయ‌ల‌సీమ యాస‌, భాష అథెంటిక్ గా అనిపించాయి.

బ‌ల‌హీన‌త‌ల విష‌యానికొస్తే.. క‌థ ప్రారంభం చాలా నెమ్మ‌దిగా సాగుతుంది. అక్క‌డ‌క్క‌డ స్లో ఫేజ్ బాగా ఇబ్బంది పెడుతుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగుల కోసం మ‌ధ్య‌మ‌ధ్య‌లో పాట‌లు పెట్టినా అది స‌రిపోలేదు. ర‌వి – ఓబులేసు మ‌ధ్య ప్రేమ చిగురించ‌డానికి బాగానే చూపించాడు కానీ, విడిపోవ‌డంలో ఉన్న ఆర్థ్ర‌త‌, దానికి గ‌ల కార‌ణం స‌రిగా పండ‌లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు ర‌వి ప్ర‌కాష్‌కి ఓ సుదీర్ఘ‌మైన స‌న్నివేశం ఇచ్చారు. అందులో బోలెడంత ఎమోష‌న్ ఉంది. ర‌విప్ర‌కాష్ లాంటి న‌టుడికి ఇదో గొప్ప అవ‌కాశం కూడా. కానీ.. ఆ పాత్ర చెప్పే సంభాష‌ణ‌ల్లో ఎమోష‌న్ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వ‌డం చాలా క‌ష్టం. ఎప్పుడైతే ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవ్వ‌మో. అదో సాగ‌దీత స‌న్నివేశంలా అనిపిస్తుంది. కొండ‌పొలం అంటే ఏమిటి? ఎందుకోసం? ఆ ప్ర‌యాణం సాగే విధానం ఎలాంటిది? అనేది అర్థం కాక‌పోతే – ఈ క‌ష్ట‌సుఖాలు, ఎమోష‌న్లు రిలేట్ చేసుకోవ‌డం కూడా క‌ష్ట‌మే.

కొండ‌పొలం ఓ మంచి న‌వ‌ల‌. దాన్ని తెర‌పై చూపించ‌డం చాలా క‌ష్టం.అయినా స‌రే.. క్రిష్ త‌న వంతుగా ప్ర‌య‌త్నం చేశాడు. ర‌చ‌యిత రాస్తున్న‌ప్పుడు ఎంత నిజాయితీగా ఉన్నాడో, తీస్తున్న‌ప్పుడు క్రిష్ కూడా అంతే నిజాయ‌తీ చూపించాడు అయితే సాగ‌దీత స‌న్నివేశాల వల్ల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవ్వ‌డం ప్రశ్నార్ధకం . క‌మ‌ర్షియ‌ల్ గా ఈ సినిమా బాక్సాఫీసుని మెప్పిస్తుందా? లేదా అనేది ప‌క్క‌న పెడితే – ఓ మంచి ప్ర‌య‌త్నంగా మిగిలిపోతుంది.

తెలుగు360 రేటింగ్: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close