హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు పశ్చిమ దిశ నుండి దక్షిణ దిశ వైపు వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కొంగరకలాన్, ఆదిభట్ల పరిసర ప్రాంతాలు రాబోయే రోజుల్లో నగరానికి సరికొత్త ఐటీ హబ్ గా అవతరించబోతున్నాయని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో, ఐటీ కంపెనీలు , రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇప్పుడు దక్షిణ హైదరాబాద్‌పై కన్నేశారు. ఫాక్స్‌కాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల రాకతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఇన్వెస్టర్ల హాట్ స్పాట్‌గా మారిపోయింది.
ప్రస్తుతం ఆదిభట్ల పరిసరాల్లో ఉన్న ఏరోస్పేస్ సెజ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి పరిశ్రమలు ఈ ప్రాంత అభివృద్ధికి పునాది వేశాయి. వీటికి తోడుగా ఇప్పుడు కొంగరకలాన్ ప్రాంతంలో భారీ ఎలక్ట్రానిక్ సిటీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటుండటంతో, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ పారిశ్రామిక వృద్ధిని గమనిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విల్లా ప్రాజెక్టులు మరియు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లను భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.
పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడ భూముల ధరలు ఇంకా అందుబాటులోనే ఉండటం మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో ఉండటం వల్ల ఎయిర్‌పోర్టుకు, గచ్చిబౌలికి ప్రయాణం సులభతరం కావడమే కాకుండా, రీజినల్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు కూడా ఈ ప్రాంతానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. విల్లాస్, ఫ్లాట్ల నిర్మాణంతో పాటు కమర్షియల్ స్పేస్ కూడా వేగంగా విస్తరిస్తుండటంతో, దక్షిణ హైదరాబాద్ త్వరలోనే హైటెక్ సిటీ 2.0 గా మారుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. వెడల్పాటి రోడ్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో కొంగరకలాన్, ఆదిభట్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి వెన్నెముకగా నిలుస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
