కొత్తపలుకు : జగన్‌కి టీఆర్ఎస్ పెట్టుబడులు “వాన్‌పిక్ పోర్టు” కోసమేనంటున్న ఆర్కే..!

తెలుగుదేశం పార్టీపై.. వైసీపీ చేస్తున్న రాజకీయ పోరాటానికి.. తెలంగాణ పోలీసుల్ని, వారి అధికారాల్ని… కేసీఆర్… అప్పగించడానికి కారణం ఏమిటి..? తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేయడం ఒక్కటే కారణమా..? .. తన పార్టీని అంత మొందించాలని.. ప్రయత్నించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడి కోసం తెలంగాణను ఎందుకు వాడుకోమంటున్నారు..? ఇవన్నీ చాలా మంది.. వచ్చే సందేహాలు. వీటి వెనుక ఉన్న అసలైన స్కెచ్‌ను… ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ.. వేమూరి రాధాకృష్ణ తన కొత్తపలుకు ద్వారా బయటపెట్టారు. ” ప్రకాశం జిల్లాలో వివాదాస్పదంగా మారిన వాన్‌పిక్‌ ప్రాజెక్టులో కొంత వాటాను కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు కొనుగోలు చేశారు. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే వాన్‌పిక్‌ ప్రాజెక్టును క్లియర్‌ చేయించి ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఓడరేవు నిర్మించుకోవాలన్నది కేసీఆర్‌ సన్నిహితుల కోర్కె! అలా నిర్మించే ఓడరేవుతో తెలంగాణ ప్రభుత్వం సరుకుల ఎగుమతులు, దిగుమతుల కోసం ఒప్పందం కుదుర్చుకుంటుంది! ..” ఇదీ ఆర్కే బయట పెట్టిన ప్లాన్. దీన్ని కాదనడానికి కూడా లేదు. పోర్టు ప్రయత్నాలు.. తెలంగాణ సర్కార్ చేస్తుందన్నది.. చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం.

జగన్ మోహన్ రెడ్డి తీరుపై.. ఏపీలో జరుగుతున్న చర్చల్లో కొన్ని లాజికల్ పాయింట్లను.. ఏబీఎన్ ఆర్కే బయటపెట్టారు. ” ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేని జగన్ తెలంగాణ పోలీసులను ఆశ్రయించడమే కాకుండా పొగడుతుంటారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్రా పోలీసులను తొలగించి ఏపీలో శాంతిభద్రతల బాధ్యతను కూడా తెలంగాణ పోలీసులకే అప్పగిస్తారేమో?” అన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. నిజానికి.. డేటా చోరీ అంశంలో.. ఏపీ విషయంలో వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్… అదే తరహాలో.. ఏపీ ప్రయత్నించి ఉంటే మాత్రం… సెంటిమెంట్ ఏ స్థాయిలో రెచ్చగొట్టి ఉండేవారో.. సులువుగానే ఆర్కే అంచా వేశారు. ఇప్పుడు ఇటు కేసీఆర్‌, అటు జగన్మోహన్‌రెడ్డి చర్యల వల్ల తమ ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నదన్న భావనకు ఆంధ్రాప్రజలు వస్తున్నారని తేల్చారు.

వైసీపీలో చేరుతున్న వారి బ్యాక్‌గ్రౌండ్‌ గురించి ఆర్కే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దానికో చిన్న ఉదాహరణ.. జయసుధ చేరిక. “నిజానికి ఆమెకు జగన్‌ పార్టీలో చేరాలన్న ఆలోచన లేదు. తెలంగాణ యువరాజు కేటీఆర్‌ కొద్దిరోజుల క్రితం జయసుధకు ఫోన్‌ చేసి జగన్‌ను కలిసి వైసీపీలో చేరాలని కోరారట. తొలుత అందుకు నిరాకరించిన జయసుధ చివరకు ఒత్తిళ్లకు తలవంచక తప్పలేదు..” అని ఆర్కే స్పష్టంగా వివరించారు. ఇది నిజం కాదని కేటీఆర్‌ చెప్పగలరా? అని సవాల్ కూడా కేటీఆర్‌కు చేశారు. ఇక డేటావార్‌లో.. విజయసాయిరెడ్డి కుట్రలు.. తెలంగాణ పోలీసుల యాక్షన్ ను కూడా విడమర్చి చెప్పారు. ఇటీవలి కాలంలో… సీనియర్ జర్నలిస్ట్ ఆర్కే నుంచి వచ్చిన కొత్తపలుకుల్లో ఈ వారం ఆర్టికల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పకతప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com