హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం తదితర పరిణామాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ప్రశంశించారు. దేశంపట్ల ఎంతమంది నాయకులకు పవన్‌కు ఉన్నంత స్పష్టత, దూరదృష్టి, బాధ్యత ఉన్నాయని ప్రశ్నించారు. పవన్‌పై తనకు గౌరవం, ప్రేమ పదింతలు పెరిగాయని ట్వీట్ చేశారు. రాజకీయవేత్తలకు, నాయకులకు తేడా అర్థమయిందని, రాజకీయవేత్తలు పార్టీలకు చెందినవారని, నాయకులు ప్రజలకు చెందినవారని, పవన్ నాయకుడని కోన పేర్కొన్నారు. మరోవైపు దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో భిన్నంగా స్పందించారు. గర్జించే సింహంలాంటి పవన్, మేకలాగా మాట్లాడారని అన్నారు. సింహం ఆలోచించి గర్జిస్తే దానికి అర్థంలేదని కామెంట్ చేశారు. ఇక్కడ సమస్య ఏమిటంటే గర్జించే సింహం మేకలాగా, సారీ పిల్లిలాగా మాట్లాడుతోందని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సింహం సింహంలా ఉండాలని, కుక్కలకు తన గర్జనలో అర్థాలు వివరించకూడదని వ్యాఖ్యానించారు.